#Tirumala : అన్న దానం ..మహా ప్రసాదం..ఎన్టీఆర్ పుణ్యం
కోట్లాది భక్తుల ఆకలి తీరుస్తున్న తిరుమల
Tirumala : కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా, కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా వినుతికెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలు కొలువు తీరిన శ్రీ తిరుమల పుణ్యక్షేత్రం ఆదాయంలో చరిత్రను తిరుగ రాస్తోంది. కోట్లాది రూపాయలు, లెక్కలేనంత ..లెక్కించలేనంత బంగారం, వజ్రాలు, వైఢూర్యాలతో అలరారుతున్న ఈ స్థలం భక్తులకు సేద దీరేలా చేస్తోంది.
అనునిత్యం పూజలతో మనసు దోచుకుంటున్న ఈ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. పామరుల నుంచి పండితుల దాకా , సామాన్యుల నుంచి డబ్బున్నోళ్ల దాకా, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవంగా కొలువబడుతూ, కోరుకున్న వెంటనే కోరికలు తీరుస్తూ , ఆశీస్సులు అందజేస్తూ వినుతికెక్కారు స్వామీ, అమ్మవార్లు.
ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమలను(Tirumala) దర్శించుకునేందుకు వస్తుంటారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలితో పాటు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. అంతే కాకుండా రవాణా సౌకర్యం, ఉచిత వసతి సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది. అన్నిటికంటే ముందే దర్శనం కోసం బుకింగ్ చేసుకున్న వారికంటే, నడక దారిన వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టింది. వీఐపీల పేరుతో ఇబ్బంది కలిగించ రాదంటూ కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. సామాన్య భక్తుల తర్వాతే ఎవరైనా అని స్పష్టం చేసింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వేలాది భక్తుల కోసం ఈ దేవస్థానం ప్రసాదం , అన్నదానం(Tirumala) నిరాటంకంగా నిర్వహిస్తోంది.
ఈ మహా ప్రసాదం పెట్టేందుకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించింది. తిరుమలకు వచ్చే భక్తులు ఏ ఒక్కరు ఆకలితో ఉండడానికి వీలు లేదంటూ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు ఈ మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 ఏప్రిల్ 1985 న ప్రారంభమైన ఈ మహా ప్రసాద వితరణ కార్యక్రమం గత 34 ఏళ్లుగా కొనసాగుతోంది.
లక్షలాది భక్తుల ఆకలి తీరుస్తోంది. దాదాపు 1100 కోట్ల రూపాయలు విరాళాల రూపేణా టీటీడీకి అందాయి. ఈ డబ్బులను డిపాజిట్ చేయడం వల్ల వచ్చిన వడ్డీతోనే అరుదైన అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఒక్క అన్నదానమే కాదు టిఫిన్లు, పాలు, టీ, కాఫీ , మజ్జిగ అందజేస్తోంది టీటీడి.
ప్రతి రోజు ఉదయం 9 .30 నుంచి 10.30 గంటల వరకు టిఫిన్స్ పెడతారు. మధ్యాహ్నం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అన్నం పెడతారు. చక్కర పొంగలి, అన్నం, సాంబారు, మజ్జిగ, చట్నీ, ప్రసాదం వడ్డిస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు భోజనం పెడతారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సత్రంలో ప్రతి రోజు 65 వేల మందికి వడ్డిస్తారు .
వైకుంఠం క్యూ కాంప్లెక్ లలో 45 వేల మందికి, అన్న ప్రసాదం మరో పది వేల మందికి అందజేస్తారు. అంతే కాకుండా రామ్ బగీచ , సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, పీఏసీ , హెచ్ వీసీ , ఏ ఎన్ సి , గాలిగోపురం, శ్రీనివాసం , విష్ణు నివాసం కాంప్లెక్స్ , టీటీడీ హాస్పిటల్స్ , ఎస్ వి అన్నప్రసాదం లలో అన్నదానం నిత్యం జరుగుతూనే ఉన్నది. అన్నదానం చేయాలని అనుకునే దాతలు, భక్తులు ఎవరైనా ఎన్ని డబ్బులైనా ఇవ్వవచ్చు.
ఇందు కోసం ఎలాంటి పన్ను ఉండదు. దీనికి పన్ను మినహాయింపు ఉన్నది. ఆనాడు ఆ మహానుభావుడు ఎన్టీఆర్ చేసిన ఈ ఆలోచన ఈరోజు లక్షలాది భక్తుల కడుపులు నింపుతోంది. ఈఓ కూడా ధన్య జీవులే . గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా ..ఆపద మొక్కుల వాడా గోవిందా. అన్నదాతా సుఖీభవ సుఖీభవ…!
No comment allowed please