KC Venu Gopal : ‘అగ్నిపథ్’ పై అత్యవసర మీటింగ్ పెట్టండి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్
KC Venu Gopal : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం పై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాలలో పరిస్థితి అదుపు తప్పింది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున కేంద్ర సర్కార్ పై మండి పడుతున్నారు.
ఈ స్కీం వల్ల తమకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో భారీ ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది. పలు రైళ్లు దగ్ధమయ్యాయి. బస్సులను ధ్వంసం చేశాయి.
కోట్లాది రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లింది. బీహార్ లో మొదలైన ఈ ఆందోళన , ఆగ్రహం అన్ని రాష్ట్రాలకు పాకింది. శుక్రవారం తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఒకరి మృతి చెందగా, ఎనిమిది మందికి పైగా గాయాలయ్యాయి.
ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అటు నిరుద్యోగులతో పాటు ఇటు విపక్షాలు కేంద్ర సర్కార్ తీసుకు వచ్చిన అగ్ని పథ్ స్కీంను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్(KC Venu Gopal). వెంటనే అగ్ని పథ్ స్కీంకు సంబంధించి రక్షణ రంగ నిపుణులు, ప్రతిపక్షాలతో అత్యవసర సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగా కేసీ వేణుగోపాల్ రక్షణ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జుయల్ ఓరమ్ కు లేఖ రాశారు. ఈ స్కీంకు సంబంధించి ఎలాంటి ముందస్తు చర్చలు జరపకుండానే ఆఘమేఘాల మీద కేంద్రం ప్రకటించిందని ఆరోపించారు.
దీని వల్ల యువకుల్లో తప్పుడు సంకేతం వెళ్లిందన్నారు కేసీ వేణుగోపాల్(KC Venu Gopal) .
Also Read : ప్లీజ్ సంయనం పాటించండి – వరుణ్ గాంధీ