A Md Imtiaz IAS: వైసీపీలో చేరిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ !

వైసీపీలో చేరిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ !

A Md Imtiaz IAS: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ అని తేడా లేకుండా టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు… ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు. దీనితో రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. స్థానిక నాయకత్వాల అభిప్రాయాలు, రాజకీయ వ్యూహకర్తలు నిర్వహించిన సర్వే ఫలితాలను బట్టి వివిధ పార్టీల నుండి మాత్రమే కాదు అధికారులను కూడా ఈ సారి అభ్యర్ధులుగా ప్రకటించడానికి రాజకీయ పార్టీలు వెనుకాడటంలేదు.

A Md Imtiaz IAS Joined in YSRCP

ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ ఏ.ఎండి. ఇంతియాజ్ వైసీపీలో(YCP) చేరారు. గురువారం సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. 24 గంటల క్రితం వరకు ఐఏఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్… స్వచ్చంద పదవీ విరమణ కోసం రెండు రోజుల క్రితం ధరఖాస్తు చేసుకున్నారు. ఇంతియాజ్ ధరఖాస్తుకు ప్రభుత్వం నుండి ఆమోద మద్ర పడిన గంటల వ్యవధిలోనే ఆయన సీఎం జగన్ ను కలిసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, కర్నూలు మేయర్‌ బి.వై.రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గతంలో సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్ బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాలపై ఆశక్తితో వైసీపీలో(YCP) చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి గురువారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. గత కొన్ని రోజులుగా కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నారని సమాచారం. ముఖ్యనేతలు, ఎమ్మెల్యే, జిల్లా నేతలతో ఆయన అభ్యర్థిత్వంపై చర్చించి.. ఇంతియాజ్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇంతియాజ్ చేత స్వచ్చంద పదవీ విరమణ చేయించినట్లు కూడా తెలుస్తోంది.

కర్నూలు టిక్కెట్టు కోసం స్థానిక ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకోవడంతో… సీఎం జగన్ ఇద్దరికీ చెక్ పెట్టి మాజీ ఐఏఎస్ ను రంగంలోనికి దించినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికలు అటు వైసీపీకు, ఇటు టీడీపీ-జనసేనల కూటమికి కూడా ప్రతిష్టాత్మకం కావడంతో… ఐఏఎస్ అధికారుల రాజకీయ ప్రవేశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : Telangana Govt : ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికై ఐఏఎస్ లకు అప్పగించిన సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!