Ajit Doval: జాతీయ భద్రత సలహాదారుగా అజిత్‌ డోవల్‌ పునర్ నియామకం !

జాతీయ భద్రత సలహాదారుగా అజిత్‌ డోవల్‌ పునర్ నియామకం !

Ajit Doval: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో నూతన సర్కారు కొలువుదీరింది. ఈ క్రమంలోనే దేశ భద్రత అంశానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత సలహాదారుగా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అజిత్‌ డోవల్‌ ను మరోసారి నియమించింది. ‘ఎన్‌ఎస్‌ఏ’గా ఆయన నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. దీనితోపాటు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీకే మిశ్రాను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ… అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

Ajit Doval…

2024 జూన్‌ 10 నుంచి మొదలుకొని ప్రధాని మోదీ పదవీకాలం పూర్తయ్యేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు డోవల్‌ ఎన్‌ఎస్‌ఏగా ఉంటారని సిబ్బంది వ్యవహారాలశాఖ పేర్కొంది. పదవీకాలంలో ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదాను కేటాయిస్తారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే తొలిసారి అధికారంలో వచ్చిన సమయంలో 2014 మే 30న డోవల్‌ తొలిసారి ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు.

ఉత్తరాఖండ్​(ఒకప్పటి ఉమ్మడి ఉత్తరప్రదేశ్)లో 1945లో జన్మించారు డోవల్(Ajit Doval). 1968 బ్యాచ్ ​కేరళ కేడర్ ఐపీఎస్ అధికారిగా వృత్తిజీవితం మొదలుపెట్టి… 2005లో ఐబీ డైరెక్టర్‌గా పదవీవిరమణ పొందారు. 2014లో మోదీ ప్రభుత్వంలో అయిదో జాతీయ భద్రత సలహాదారుగా నియమితులయ్యారు. 2016లో పీఓకేలో భారత్ ​జరిపిన లక్షిత దాడులు, 2019లో బాలాకోట్‌ వైమానిక దాడుల్లో కీలకంగా వ్యవహరించారు. డోక్లాం విషయంలో చైనాతో పరిస్థితులను చక్కబెట్టడంలో కృషి చేశారు.

Also Read : Mahila Sakthi Canteen: తెలంగాణాలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు !

Leave A Reply

Your Email Id will not be published!