Amul Nandini Comment : పాల వ్యాపారం రాజ‌కీయ దుమారం

అమూల్ వ‌ర్సెస్ నందిని

Amul Nandini Comment : క‌న్న‌డ నాట అమూల్ వ‌ర్సెస్ నందిని పాల ఆధారిత సంస్థ‌ల వ్యాపారం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారి తీసింది. డెయిరీ దిగ్గ‌జం అమూల్ గుజ‌రాత్ కు చెందిన‌ది. దేశ వ్యాప్తంగా అత్య‌ధికంగా వ్యాపారం చేస్తోంది. కోట్లాది రూపాయ‌ల ఆదాయం గ‌డిస్తోంది. ఉన్న‌ట్టుండి అమూల్ తాము త్వ‌ర‌లో కర్ణాట‌క‌లో ప్ర‌వేశించ‌నున్న‌ట్లు ట్వీట్ చేసింది.

దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు మిన్నంటాయి. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అమూల్ పాల కంటే నందిని పాలు బెట‌ర్ అంటూ కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు ఇప్ప‌టికి రాష్ట్రాన్ని దోచుకున్న‌ది చాల‌దా..ఇక పాల వ్యాపారంపై కూడా మీ క‌న్ను ప‌డిందా అంటూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌. పార్టీల‌కు అతీతంగా నందినికి మ‌ద్ద‌తు పెర‌గ‌డంతో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ గ‌త్యంత‌రం లేక స్పందించాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు అమూల్ ఎంట్రీ ఇవ్వదంటూ పేర్కొంది.

ప్ర‌తిప‌క్షాల‌కు నందిని , అమూల్(Amul Nandini Comment) వివాదం ఒక ఆయుధంగా మారింది. వ‌చ్చే మే నెల 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఎన్నిక‌ల వేడి నెల‌కొంది. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తే నందినిని కాపాడుతామ‌ని, ర‌క్షించుకుంటామ‌ని ప్ర‌క‌టించారు శివ‌కుమార్. కన్న‌డిగులు త‌మ బ్రాండ్ గా భావిస్తారు నందిని డెయిరీ డెవ‌ల‌ప్ మెంట్ ను. కొన్ని వ‌ర్గాలు ఆందోళ‌న బాట ప‌ట్టాయి.

బీజేపీ మ‌ద్ద‌తుతోనే అమూల్ ఈ ప్ర‌క‌ట‌న చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. చివ‌ర‌కు డ్యామేజ్ అవుతుంద‌ని భావించిన స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గింది. క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. క‌ర్ణాట‌క మిల్క్ ఫెడ‌రేష‌న్ బ్రాండ్ నందినికి ముప్పు క‌లిగిస్తుంద‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ , జేడీఎస్ ఆరోపంచాయి. క‌న్న‌డిగుల గుర్తింపు, కాంగ్రెస్ దాడుల నేప‌ధ్యంతో ముందు జాగ్ర‌త్త‌గా బీజేపీ మేల‌కొంది.

అమూల్ బెంగ‌ళూరులో ఆన్ లైన్ డెలివరీల‌ను చేస్తామంటూ ట్వీట్ చేయ‌డం తీవ్ర దుమారానికి ,ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురైంది. ఇది పూర్తిగా కేఎంఎఫ్ ని తొక్కి పెట్ట‌డం త‌ప్పా మ‌రోటి కాద‌ని పేర్కొన్నారు. ఈ ఒక్క నందినిపై వేలాది మంది రైతులు ఆధార ప‌డ్డారు. నందిని క‌ర్ణాట‌క‌లో ప్ర‌తి ఇంటికీ చేరుతోంది. త‌మ ఇంట్లో ఒక భాగంగా మారి పోయింది.

ఇటీవ‌ల అమూల్ ఓ ట్వీట్ లో చేసిన ప్ర‌క‌ట‌న రాద్దాంతానికి కార‌ణ‌మైంది. పాలు , పెరుగుతో తాజాద‌నం కొత్త వేవ్ బెంగ‌ళూరుకు రాబోతోంది. కెంగేరీ నుండి వైట్ ఫీల్డ్ దాకా ..ప్ర‌తి ఒక్క‌రికీ శుభాకాంక్ష‌లు అంటూ పేర్కొంది.

ఈ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. గో బ్యాక్ అమూల్ , సేవ్ నందిని పేరుతో హ్యాష్ ట్యాగ్ లు వైర‌ల్ అయ్యాయి. తాము అమూల్ పాలను వాడ‌మ‌ని రాష్ట్రంలోని హోటళ్ల య‌జ‌మానులు ప్ర‌క‌టించే దాకా వెళ్లింది.

పాడి రైతుల‌కు మేలు చేకూరుస్తున్న నందినిని మాత్ర‌మే వాడ‌తామ‌ని స్ప‌ష్టం చేశాయి. నందిని ఉత్ప‌త్తుల‌ను వాడాల‌ని, ప్రోత్స‌హించాల‌ని కోరుతూ క‌ర్ణాట‌క ర‌క్ష‌న వేదిక పిలుపునిచ్చింది. పేద‌ల నుంచి పెద్ద‌ల దాకా కొనుగోలు చేసేలా నందిని ఉత్ప‌త్తులు ఉన్నాయి. మొత్తంగా క‌న్న‌డిగుల ఆగ్ర‌హానికి అమూల్ అర్ధాంత‌రంగా విర‌మించుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఏదైనా ప్ర‌జా చైత‌న్యం ముందు ఎవ‌రైనా త‌ల వంచాల్సిందేన‌ని తేలి పోయింది.

Also Read : భ‌గ్గుమంటున్న బంగారం

Leave A Reply

Your Email Id will not be published!