Anand Mahindra: తెలంగాణా ఐఏఎస్ అధికారిపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
తెలంగాణా ఐఏఎస్ అధికారిపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Anand Mahindra : తెలంగాణాకు చెందిన యువ ఐఏఎస్ అధికారి డి. కృష్ణ భాస్కర్(D Krishna Bhaskar) పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు కురిపించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించే ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)… వారాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టేందుకు ప్రతి సోమవారం స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకుంటారు. దీనిలో భాగంగా ఈ వారానికి తన మండే మోటివేషన్ ఐఏఎస్ అధికారి డి. కృష్ణ భాస్కర్ అని పేర్కొన్నారు. యువ ఐఏఎస్ అధికారి డి.కృష్ణ భాస్కర్ కథనాన్ని పంచుకున్న ఆయన… ఆ అధికారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతున్నట్లు తెలిపారు.
Anand Mahindra Appreciates
‘‘వ్యవసాయ రంగం గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. భూగర్భ జలాల స్థాయిలను పెంచడంలో దేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో మన అందరికీ బాగా తెలుసు. అలాంటి సమయంలో ఈ యువ ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ సాధించిన విజయాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే. సమస్య ఎలాంటిదైనా దాన్ని అధిగమించగలమని ఆయన మనలో విశ్వాసాన్ని నింపగలిగారు. దానికి కావాల్సిందల్లా దృఢ సంకల్పమే అని రుజువు చేశారు. అందుకే ఆయనే నా మండే మోటివేషన్’’ అంటూ ఆనంద్ మహీంద్రా… ఐఏఎస్ అధికారి డి. కృష్ణ భాస్కర్ పై ప్రశంసలు కురిపించారు.
తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి దేవరకొండ కృష్ణ భాస్కర్… రాజన్న సిరిసిల్లా జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అద్భుత విజయాలు సాధించారు. నీటి కొరతను అధిగమించేందుకు పలు చర్యలు చేపట్టారు. పైపుల ద్వారా నీటి సరఫరా, రిజర్వాయర్లకు భూమి సేకరణ, నీటి వనరుల కోసం పూడికతీత వంటి చర్యలతో నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచారు. నీటి లభ్యతను విస్తృతంగా పెంచడం కోసం రిజర్వాయర్ల సమీపంలో చిన్న ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఆయన చర్యలతో నాలుగేళ్లలోనే భూగర్భ జలాల స్థాయిలను ఆరు మీటర్ల మేర పెంచగలిగారు. దీనితో కృష్ణ భాస్కర్ కు సంబంధించి ఓ స్ఫూర్తిదాయక కథనాన్ని గతేడాది జూన్‌లో ‘బెటర్ ఇండియా’ పేజీ పంచుకుంది. ఆ పోస్ట్ నే తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ ఈ యువ అధికారిపై ప్రశంసలు కురిపించారు. కృష్ణకుమార్ సేవలకు గానూ 2019, 2020లో వరుసగా రెండుసార్లు ప్రజా పాలనలో ప్రధానమంత్రి అత్యుత్తమ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.
Also Read : CM MK Stalin: సీఎం స్టాలిన్ పై కన్నడ వాసుల ఆగ్రహం ! కారణమేమిటంటే ?