AP DSC 2024: డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు… తప్పుల సవరణకు కూడా ఛాన్స్ !
డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు... తప్పుల సవరణకు కూడా ఛాన్స్ !
AP DSC 2024: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ – 2024 పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం దరఖాస్తు ఫీజు చెల్లింపుకు బుధవారంతో సమయం ముగియనుంది. అయితే డీఎస్సీ నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంతమంది డిఈడీ అభ్యర్ధులు హై కోర్టును ఆశ్రయించడంతో… గత మూడు రోజులుగా విచారణ జరుగుతోంది. బీఈడీ(B.ED) అభ్యర్ధులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించడంపై కోర్టులో వాద, ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్ధులు ఇంకా ధరఖాస్తు చేసుకోలేదు. మరోవైపు డీఎస్సీ కు ధరఖాస్తు చేసుకునే ప్రభుత్వ వెబ్ సైట్ కూడా తప్పుల తడకగా ఆప్షన్స్ ఉన్నట్లు అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25 అర్ధరాత్రి 12 గంటల వరకు ఫీజు చెల్లింపుతో పాటు ఇప్పటికే ధరఖాస్తు చేసుకున్న వారి ధరఖాస్తుల్లో తప్పుల సవరణ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటివరకు టెట్‌కు 3,17,950 మంది, డీఎస్సీకి 3,19,176 మంది దరఖాస్తులు చేసుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. హెల్ప్ డెస్క్ సమయాలను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పొడిగించినట్లు పేర్కొంది.
AP DSC 2024 Updates
అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు చేసే సమయంలో తప్పుల్ని సవరించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అప్లికేషన్‌ను ఎడిట్ చేసుకొని మళ్లీ సమర్పించుకొనే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపింది. తమ అప్లికేషన్ ను ఎడిట్ చేయాలనుకునే అభ్యర్ధులు… తొలుత అభ్యర్థులు వెబ్సైట్ https://apdsc.apcfss.in/లో డిలీట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అభ్యర్థి పాత జర్నల్ నంబర్ తో, అభ్యర్థి మొబైల్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ ను పొందవచ్చు. తద్వారా ఎలాంటి రుసుం చెల్లించకుండా తప్పులు సరిదిద్ది అప్లికేషన్‌ను మళ్లీ సమర్పించుకోవచ్చు. అయితే అభ్యర్థి పేరు, తాను ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ మార్చుకోవాలంటే పరీక్ష కేంద్రంలో నామినల్స్ రోల్స్‌లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చు.
Also Read : Dubai Prisioners: దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి !