2024 Elections: ఎన్నికల వేళ మరింత సమన్వయంతో పనిచేస్తాం: తెలుగు రాష్ట్రాల సీఎస్ లు
ఎన్నికల వేళ మరింత సమన్వయంతో పనిచేస్తాం: తెలుగు రాష్ట్రాల సీఎస్ లు
2024 Elections: రానున్న ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి. తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సచివాలయంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ… మే 13న పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఇప్పటికే సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించామన్నారు.
2024 Elections Update
‘‘అక్రమ మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశాం, శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఇదే వాతావరణాన్ని పోలింగ్ ముగిసే వరకు మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి సమావేశం దోహదపడుతుంది. గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు రాకుండా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో మరింత అప్రమత్తత అవసరం. పోలీసులు 36, ఆటవీ శాఖ 3, ఎక్సైజ్ 8, వాణిజ్యపన్నుల శాఖ 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాయి. 224 ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో 24 గంటలూ పటిష్ఠ గస్తీని ఏర్పాటు చేశాం.
తెలంగాణలో(Telangana) తీవ్రవాద ప్రాబల్యం లేదు. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు జరగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర బలగాలు సమన్వయంతో పనిచేస్తున్నారు’అని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. తెలంగాణతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ రవి గుప్తా, అదనపు డీజీలు శివధర్ రెడ్డి, మహేష్ భగవత్, ఏపీ అదనపు డీజీ డా. శంకబ్రత బాగ్చి, ఏపీ వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. రజత్ భార్గవ తదితరులు పాల్గొన్నారు.
Also Read : MLC Kavitha: కవితకు వార్నింగ్ ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా !