CM Revanth Reddy: 15 ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి – సీఎం రేవంత్‌

15 ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి - సీఎం రేవంత్‌

CM Revanth Reddy: లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను మంత్రిగా చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10శాతంగా ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్‌ ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను బీసీ-డీ నుంచి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో పోరాడతామన్నారు. నారాయణపేటలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ జనజాతర సభ’లో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నా… పదేళ్లపాటు కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. మరోవైపు మాదిగల వర్గీకరణ చేయాల్సిందేనని, వాళ్లకు న్యాయం జరగాల్సిందేని సీఎం అన్నారు. భవిష్యత్తులో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

CM Revanth Reddy Comment

‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ జెండాను వదల్లేదు. కాంగ్రెస్‌ పార్టీ పేదలకు, బీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించింది. వెనుకబడిన సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్‌కు మించింది లేదు. నారాయణపేట మున్సిపాలిటీకి భూగర్భ డ్రైనేజీ మంజూరు చేస్తాం. రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)ని ఊడగొట్టాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అంటున్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని ఆమె ఎప్పుడైనా మోదీని అడిగారా? మక్తల్‌- వికారాబాద్‌ రైల్వే లైన్‌ కావాలని డిమాండ్‌ చేశారా?’’ అని రేవంత్ ప్రశ్నించారు.

గడిచిన పదేళ్లలో కేసీఆర్‌ ఎంతమందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ‘‘ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించాం. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులివ్వాలి. వారికి న్యాయం చేసేందుకే బీసీ కులగణనకు తీర్మానం చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. కేసీఆర్‌ పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు.

పాలమూరు బిడ్డ, పేదోడి బిడ్డ సీఎం అయితే దొరలు ఓర్వలేకపోతున్నారు. దొరలు మాత్రమే కుర్చీల్లో కూర్చోవాలా? పేద బిడ్డలు కూర్చోవద్దా? కేసీఆర్‌.. తర్వాత ఆయన కుమారుడు మాత్రమే సీఎం కావాలా? జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీని మోదీకి తాకట్టుపెట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద ఉంచారు. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్‌ చెబుతున్నారు. వందరోజులకే నన్ను గద్దె దించాలని కేసీఆర్‌ అంటున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీని గద్దె దించాలని ఎందుకు అనడం లేదు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల మేర రైతు రుణమాఫీ చేస్తాం’’ అని రేవంత్ అన్నారు.

Also Read : 2024 Elections: ఎన్నికల వేళ మరింత సమన్వయంతో పనిచేస్తాం: తెలుగు రాష్ట్రాల సీఎస్‌ లు

Leave A Reply

Your Email Id will not be published!