PM Narendra Modi: ఎలక్టోరల్‌ బాండ్ల రద్దుపై మోదీ కీలక వ్యాఖ్యలు !

ఎలక్టోరల్‌ బాండ్ల రద్దుపై మోదీ కీలక వ్యాఖ్యలు !

PM Narendra Modi: ఎలక్టోరల్‌ బాండ్ల విధానం రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడిందన్నారు. దీనిపై నిజాయతీగా ఆలోచిస్తే… వీటి రద్దుపై ప్రతిఒక్కరూ బాధ పడతారన్నారు. జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు నగదు ఖర్చు చేస్తాయన్న మోదీ… నల్లధనాన్ని అరికట్టేందుకు తన మనసుకు వచ్చిన స్వచ్ఛమైన ఆలోచనే ఎలక్టోరల్‌ బాండ్లు అని అన్నారు. నల్లధనం నిర్మూలన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇదే సరైన మార్గం అని తాను ఎన్నడూ చెప్పలేదని ప్రధాని తెలిపారు. ఈ పథకం కారణంగా బీజేపీకే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని ప్రతిపక్షాలు ఆరోపించడంపై ఆయన ధ్వజమెత్తారు. బాండ్ల అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

PM Narendra Modi Comment

2047 వరకు దేశ భవిష్యత్‌ పై తాను వేసుకున్న ప్రణాళికను ప్రధాని ఈసందర్భంగా పంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే… మోదీ(PM Narendra Modi) సర్కారు రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తారని ప్రతిపక్షాలు ఆరోపించడాన్ని ఖండించారు. ‘‘దేశ భవిష్యత్తుపై నా వద్ద స్పష్టమైన ప్రణాళికలున్నాయి. రాజ్యాంగం మార్పుపై వస్తున్న వదంతులను నమ్మి భయపడకండి. నా దేశ సంపూర్ణ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ప్రభుత్వాలు తాము ప్రతీది చేశామని చెప్పుకుంటాయి. కానీ నేను అన్నీ చేశానని చెప్పను. దేశ అవసరాలు చాలా ఉన్నాయి. కాబట్టి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతీ కుటుంబం కలలను నెరవేర్చాలి. అందుకే ఇప్పటివరకు మేము చేసింది ట్రైలర్‌ మాత్రమే’’ అని అన్నారు.

‘‘గతంలో గుజరాత్‌ కు సీఎంగా చాలాకాలం బాధ్యత వహించా. అందుకే నేను అనుభవాన్ని నమ్ముతా. దేశంలో ఎప్పుడూ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఆ సమయంలో 30-40 మంది సీనియర్‌ అధికారులు ఎన్నికల విధులకు వెళ్లేవారు. అప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతానో అనే ఆందోళన ఉండేది. ఎన్నికలు వస్తే ఆ సమయాన్ని కాలక్షేపంగా తీసుకోవద్దని అప్పుడు నాకు అనిపించింది. అందుకే తదుపరి ప్రభుత్వం కోసం కార్యాచరణను రూపొందించాలని ముందస్తుగానే అధికారులకు చెబుతుండేది. ఇలా అప్పట్లోనూ 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకునేవాడిని’’ అని తెలిపారు.

Also Read : CM Revanth Reddy: 15 ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి – సీఎం రేవంత్‌

Leave A Reply

Your Email Id will not be published!