Arvind Kejriwal: అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Arvind Kejriwal: మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆయన తరఫున న్యాయవాది వివేక్ జైన్ బుధవారం వెల్లడించారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.
Arvind Kejriwal Approached
మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్… ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. ఈడీ వద్ద తగిన ఆధారాలున్నాయని… అందుకే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. మనీలాండరింగ్ పై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని పేర్కొంది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని తేల్చి చెప్పింది. సీఎం అయినంత మాత్రానా అరెస్ట్ చేయకూడదా అంటూ ఘాటుగా స్పందించింది. దీనితో హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్… సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మద్యం విధానం కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకొని విచారించగా… ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్టును సవాల్ చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. అది వ్యతిరేకంగా ఉండటంతో కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Arvind Kejriwal -ఆప్ కు ఎదురుదెబ్బ ! మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా !
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అరెస్టుతో సంక్షోభంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ నేత, ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బుధవారం రాజీనామా చేశారు. ఇప్పటివరకు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్… పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తూ కేబినెట్, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
‘‘ప్రజలకు సేవ చేసేందుకు, అవినీతిపై పోరాడాలన్న బలమైన సంకల్పాన్ని చూసి ఆప్ లో చేరాను. కానీ ఈరోజు ఆ పార్టీనే అవినీతికి అడ్డాగా మారిపోయింది. అందుకే దీనిని వీడాలని నిర్ణయించుకున్నాను’’ అని రాజ్‌కుమార్ వెల్లడించారు. ఆప్ లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందని ఆరోపించారు. తాను దళితుల కోసం పని చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండటం వృథా అని వ్యాఖ్యానించారు. ఆయన పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి.
మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఉద్దేశమే తమ పార్టీని అంతం చేయడానికేనని తాము ఇప్పటికే చెప్పామన్నారు. బీజేపీ ఈడీ, సీబీఐని ప్రయోగించి తమ మంత్రులను, ఎమ్మెల్యేలను చీల్చుతోందని… ఇది తమందరికీ ఓ పరీక్షలాంటిదన్నారు. ఆనంద్‌ను గతంలో అవినీతిపరుడని పిలిచిన బీజేపీలోనే ఇప్పుడు ఆయన చేరబోతున్నారంటూ వ్యాఖ్యానించారు.
Also Read : Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ ముగింపు సభకు భారీ ఏర్పాట్లు