Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు ! అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల ఆందోళన !
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు ! అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల ఆందోళన !
Arvind Kejriwal: మద్యం పాలసీలో అవకతవకలతో సంబంధం ఉణ్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. గురువారం రాత్రి సీఎం అధికార నివాసంలో సోదాలు నిర్వహించడంతో పాటు కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకున్నప్పుడు ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలను రంగంలోనికి దించి భద్రతను కట్టుదిట్టం చేసారు. సీఎం కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసనలకు ఆప్ పిలుపునిచ్చింది.
మరోవైపు సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ ఢిల్లీ పోలీసులు మూసివేశారు. కీలక పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్(Arvind Kejriwal) రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా… అరెస్టయినప్పటికీ ఆయనే సీఎంగా కొనసాగుతారని ఆప్ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ప్రకటించారు. అవసరమైతే జైలునుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని అన్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఇప్పటివరకు 16 మందిని ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసు పలుమార్లు కేజ్రీవాల్ పేరును అభియోగ పత్రాల్లో ఈడీ ప్రస్తావించింది. విచారణకు హాజరుకావాలని ఈడీ 9సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ నిరాకరించారు. అంతేకాదు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనితో కేజ్రీవాల్ అభ్యర్థనను జస్టిస్ సురేశ్‌కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్ పిటిషన్ పై ఈడీని వివరణ కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే ఈడీ అధికారుల బృందం సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లడం, సోదాలు చేయడం, ప్రశ్నించి ఆయనను అదుపులోకి తీసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇదే కేసులో… గత వారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే జైల్లో ఉన్నారు.
Arvind Kejriwal – ఇది రాజకీయ కుట్ర – ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా
లోక్ సభ ఎన్నికలకు ముందు సీఎం కేజ్రీవాల్ అరెస్టు చేయడం పెద్ద రాజకీయ కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా ఆరోపించారు. పంజాబ్ సీఎం మాన్, కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ పార్టీలు కూడా కేజ్రీవాల్(Arvind Kejriwal) అరెస్టును ఖండించాయి. ఎన్నికల సమయంలో అరెస్టులు రాజకీయాల స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌పవార్ విమర్శించారు. అయితే మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ తప్పుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. ‘భయపడిన ఓ నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటున్నాడు. మీడియా సహా అన్ని సంస్థలను బంధించి, పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, కంపెనీల నుంచి డబ్బు వసూలు చేస్తూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాను స్తంభింపజేస్తూ ప్రవర్తిస్తున్నారు. దీనికి ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
Also Read : Drugs in Visakhapatnam: విశాఖ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత ! 25 టన్నుల డ్రగ్స్ ను సీజ్ చేసిన సీబిఐ !