Assam CM: జుబిన్‌ గర్గ్‌ మరణంపై విచారణకు అస్సాం సీఎం ఆదేశం

జుబిన్‌ గర్గ్‌ మరణంపై విచారణకు అస్సాం సీఎం ఆదేశం

Assam CM : గాయకుడు జుబిన్‌ గర్గ్‌ మరణంపై అస్సాం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనకు నివాళిగా శనివారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. జుబిన్‌ అంతిమయాత్రలో ప్రజలు శాంతియుతంగా మెలగాలని ఆయన భార్య గరీమా సైకియా గర్గ్‌ పిలుపునిచ్చారు. సింగపూర్‌ వెళ్లిన జుబిన్‌… శుక్రవారం అక్కడ సముద్రంలో లైఫ్‌ జాకెట్‌ లేకుండా ఈతకు దిగి చనిపోయారు. ఈ ఘటనపై అస్సాంలో అనేక ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని… వీటిని సీఐడీకి బదిలీ చేసి… విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించినట్లు అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వ శర్మ శనివారం స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ పోలీసులు నార్త్‌ ఈస్ట్‌ ఇండియా ఫెస్టివల్‌ ముఖ్య నిర్వాహకుడు శ్యామ్‌కను మహంత, జుబిన్‌ మేనేజర్‌ సిద్ధార్థ శర్మ, ఇతరులపై కేసులు నమోదు చేశారు. వీరిద్దరూ కుట్రపూరితంగా కచేరి పేరుతో జుబిన్‌ ను విదేశాలకు తీసుకెళ్లారని, నిజానికి ఆయనను చంపాలన్నదే వారి ఉద్దేశమని ఫిర్యాదుదారులు ఆరోపించారు.

Assam CM Key Orders

ఈ అంశంపై భారత్‌ లో సింగపూర్‌ హైకమిషనర్‌ సైమన్‌ వాంగ్‌తో మాట్లాడానని… గాయకుడి మరణంపై లోతైన విచారణ జరిపించాలని కోరినట్లు హిమంత వివరించారు. ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. జుబిన్‌ మరణానికి ముందు మహంత, శర్మలు ఆయన వెంటే ఉన్నారని చెప్పారు. వారిని విచారిస్తామన్నారు. గాయకుడు మృతి చెందడానికి ముందురోజు రాత్రి ఆయనను ఒక పార్టీకి తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. దానిలో నిజానిజాలపై పరిశీలన చేపట్టినట్లు పేర్కొన్నారు. జుబిన్‌ మృతదేహం శనివారం అర్ధరాత్రి దిల్లీకి చేరుకుంది.

జుబిన్‌ మృతదేహాన్ని అందుకోవడానికి హిమంత దిల్లీ వెళ్లారు. ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో పార్థివ దేహాన్ని గువాహటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. జుబిన్‌ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం నగరంలోని అర్జున్‌ భోగేశ్వర్‌ బారువా క్రీడా ప్రాంగణంలో ఉంచుతారు. అంత్యక్రియలు ఎక్కడ జరపాలన్నది ఆదివారం సాయంత్రం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read : Minister Satyakumar: పీపీపీ విధానంపై వైఎస్ జగన్‌ కు మంత్రి సత్యకుమార్ సవాల్

Leave A Reply

Your Email Id will not be published!