Justice BR Gavai: ప్రభుత్వ వ్యతిరేక ఉత్తర్వుల జారీకు కొందరు వెనుకంజ – సీజేఐ గవాయ్
ప్రభుత్వ వ్యతిరేక ఉత్తర్వుల జారీకు కొందరు వెనుకంజ - సీజేఐ గవాయ్
Justice BR Gavai : పాలనా ట్రైబ్యునళ్లలో సభ్యులుగా ఉన్న మాజీ ప్రభుత్వాధికారుల్లో కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకమైన నిర్ణయాలు ప్రకటించడానికి నిరాకరిస్తున్నారని… ఈ విషయమై వారు ఆత్మశోధన చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ (Justice BR Gavai) సూచించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)–2025 ఆలిండియా కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రిబ్యునళ్లలోని పలు సమ స్యలు, దేశంలోని న్యాయవ్యవస్థ తీరు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. అనంతరం జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ… పాలనా ట్రైబ్యునళ్లలో పాలన, న్యాయవ్యవస్థలు రెండింటికీ చెందినవారు సభ్యులుగా ఉంటారు. న్యాయ వ్యవస్థకు చెందినవారు పాలనాధికారుల అనుభవం నుంచి, పాలనాధికారులు న్యాయాధికారుల అనుభవం నుంచి నేర్చుకుంటూ పరస్పర సమన్వయంతో విధి నిర్వహణ సాగించాలని జస్టిస్ గవాయ్ సూచించారు.
Justice BR Gavai Key Comments
‘‘కానీ, పాలనా వ్యవస్థ నుంచి వచ్చి ట్రైబ్యునల్ సభ్యులైనవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీచేయడానికి ఇష్టపడటం లేదు. వారు బాధ్యతను కోర్టుల మీదకు తోసేయాలని చూస్తారు. నేడు హైకోర్టులలో, సుప్రీంకోర్టులో (Supreme Court) అతిపెద్ద వ్యాజ్యదారు ప్రభుత్వమే అని గమనిస్తే దీని వల్ల జరిగే నష్టాన్ని అర్థం చేసుకోవచ్చు. న్యాయ, న్యాయేతర ట్రైబ్యునల్ సభ్యులు ఒక్కతాటిపై పనిచేసేలా శిక్షణ శిబిరాలు నిర్వహించాలి’’ అని సీజేఐ పేర్కొన్నారు. రాష్ట్రాల్లోని దిగువ కోర్టులలో, హైకోర్టులలో న్యాయశాస్త్రంలో ఎటువంటి అనుభవం లేని తాజా న్యాయాధికారులుగా నియమిస్తున్నారని, వారు నలభై యాభై ఏళ్ల అనుభవం గల న్యాయవాదులను సైతం లెక్కచేయడం లేదని గవాయ్ వ్యాఖ్యానించారు. ఒక జడ్జి గద్దింపుల వల్ల ఓ యువ న్యాయవాది కోర్టులో స్పృహ తప్పారని తెలిపారు. న్యాయ రథానికి లాయర్లు, జడ్డిలు రెండు చక్రాలవంటి వారన్నారు. ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదని పేర్కొన్నారు.
‘ఒక న్యాయమూర్తిగా, నేను వ్యక్తి గతంగా గమనించిందేమంటే… పరిపాలనా విభాగాల నుంచి వచ్చిన ట్రిబ్యునళ్ల సభ్యులు కొందరు తమ పూర్వ అనుభవాలను మర్చిపోవడం లేదు. వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఏదైనా ఉత్తర్వును జారీ చేయడానికి ఇష్టపడటం లేదు. వీరి ఈ విషయాన్ని ఆలోచించాలని కోరుతున్నా’అని సీజేఐ అన్నారు. వీరి కోసం న్యాయ విద్యావేత్తలతో వర్క్‌షాపులు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నానన్నారు. ట్రిబ్యునళ్లలో సభ్యుల నియామకం, సర్వీసు నిబంధనల విషయంలో ఏకీకృత ప్రక్రియను తీసుకువస్తే బాగుంటుందన్నారు.
Also Read : Assam CM: జుబిన్ గర్గ్ మరణంపై విచారణకు అస్సాం సీఎం ఆదేశం
