హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి కల్తీ కుంభకోణంపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం మెస్సర్స్ భోలే బాబా ఆర్గానిక్ డైరీమిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ , మెస్సర్స్ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రమోటర్లు విపిన్ జైన్ , పోమిల్ జైన్, కుటుంబ సభ్యులు; మెస్సర్స్ సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లా , అతని కుటుంబ సభ్యులు; ఇతర సంబంధిత సంస్థలు/వ్యక్తులకు చెందిన రూ. 129.85 కోట్ల విలువైన స్థిరాస్తులు , చరాస్తులను హైదరాబాద్ లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) జోనల్ కార్యాలయం తాత్కాలికంగా జప్తు చేసింది. టీటీడీకి కల్తీ నెయ్యిని మోసపూరితంగా సరఫరా చేయడంలో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ , అవినీతి ఆరోపణలపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీ కోసం టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసి, తద్వారా టీటీడీని మోసం చేస్తూ, ప్రజారోగ్యానికి ప్రమాదం కలిగిస్తూ, భారీ అక్రమ లాభాలు ఆర్జించేందుకు జరిగిన ఒక భారీ నేరపూరిత కుట్రను వెల్లడించింది. ప్రధాన దర్యాప్తు సంస్థ నెల్లూరులోని ఎస్పీఈ , ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట ఒక అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. పీఎంఎల్ఏ కింద జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, రూ. 234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని మెస్సర్స్ భోలే బాబా సంస్థ నేరుగా , కమీషన్ కోసం తమ సొంత పేర్లతో టీటీడీ టెండర్లకు బిడ్లు వేసింది. బినామీ డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసింది.
అయితే వాస్తవానికి ఈ నెయ్యిని మెస్సర్స్ భోలే బాబా , మెస్సర్స్ సుకృతి ఫుడ్స్ ఫ్యాక్టరీలలో శుద్ధి చేసిన పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ , పామోలిన్లను మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్ , బీటా-కెరోటిన్ వంటి రసాయనాలతో కలిపి, తినే నూనెలుగా ఇన్వాయిస్ చేసి తయారు చేశారు. లెక్కలను సరి చేయడానికి, వినియోగించిన పామాయిల్‌ను బూటకపు కొనుగోలుదారులకు అమ్మినట్లు చూపించారు. అదే సమయంలో ఒక నిజమైన పాడి పరిశ్రమను చూపించడం కోసం పాలు , నెయ్యి కొనుగోళ్లను, మీగడ తీసిన పాలు వంటి ఉప-ఉత్పత్తుల అమ్మకాలను కల్పితంగా నమోదు చేశారు. బూటకపు కొనుగోళ్లకు గాను బ్యాంకింగ్ మార్గాల ద్వారా చేసిన చెల్లింపులను హవాలా మార్గాల ద్వారా నగదు రూపంలో తిరిగి ఇచ్చి, ఆ నగదును నకిలీ పామాయిల్ కొనుగోలుదారులకు నిధులు సమకూర్చడానికి, బినామీ డెయిరీలకు కమీషన్లు చెల్లించడానికి , ఈ మోసంతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులకు చెల్లించడానికి ఉపయోగించారు. ఇంతకు ముందు ప్రధాన కుట్రదారులు, బినామీ డెయిరీలు, రసాయన సరఫరాదారులు , అకామోడేషన్-ఎంట్రీ ప్రొవైడర్లతో సంబంధం ఉన్న ఉత్తరాఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ , ఆంధ్రప్రదేశ్‌లలోని 16 ప్రాంగణాలలో ఈడీ ఈ ఏడాది జూన్ 5న సోదాలు నిర్వహించింది. దీని ఫలితంగా రూ. 2.7 కోట్ల నగదు , బ్యాంకు నిల్వలను జప్తు చేయడం/స్తంభింప జేయడం జరిగింది. కల్తీ నెయ్యి తయారీ ,దానిని టీటీడీకి మోసపూరితంగా సరఫరా చేయడాన్ని పర్యవేక్షించిన మెస్సర్స్ భోలే బాబా ఆర్గానిక్ డెయిరీమిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ప్రమోటర్లు , డైరెక్టర్లైన విపిన్ జైన్ , కైలాష్ చంద్ మంగ్లాను కూడా ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం రూ. 132.55 కోట్ల జప్తులు జరిగాయి.
