Balagam Comment : కంటెంట్ ఉంటే చాలు కటౌట్ అవసరం లేదని మరోసారి నిరూపితమైంది వేణు తీసిన బలగం సినిమాతో. చిత్రం బతుకుని..ప్రయాణాన్ని..సమాజాన్ని..సమస్త..లోకాన్ని..కలల్ని..కన్నీళ్లను..సంతోషాన్ని..ఆనందాల్ని..అనుబంధాలను కలబోసేందుకు ప్రయత్నం చేస్తుంది. వెండి తెర మీద ఒక్కోసారి గుర్తు పెట్టుకునే సినిమాలు వస్తుంటాయి.
వాటికి ఎప్పటికీ గుర్తింపు ఉండనే ఉంటుంది. పూర్తిగా వ్యాపారాత్మకంగా మారి పోయిన ప్రస్తుత తరుణంలో ఒక సినిమా అద్భుత విజయాన్ని దక్కించుకుంది. అన్ని వర్గాల వారి మనసులు దోచుకుంది. ఇందులో ఏముంది..పల్లెతనపు వాతావరణం ఉంది. అంతకు మించిన మనుషుల మధ్య ఎల్లకాలం సాగే కలబోతలు ఉన్నాయి.
విడుదలైన సినిమాను చూసేందుకు జనం వాహనాల్లో వెళ్లి టాకీసుల్లో చూస్తున్నారంటే దాని క్రెడిట్ దర్శకుడిది..అభిరుచి కలిగిన నిర్మాతది..ప్రాణం పెట్టి నటించిన నటీనటులది. సహజంగా నటించడంలో , మెప్పించడంలో ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు ప్రియదర్శి.
ఇక ప్రియా కళ్యాణ్ రామ్ పల్లెటూరి అమ్మాయిలా ఒదిగి పోయింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఇది ప్రతి ఒక్కరి కథ. ఆశాల ఆరాటాల మధ్య డబ్బులు సంపాదించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో సాయిలు ఒకడు. ఒక విఫలమైన వ్యాపారవేత్త. పది లక్షల దాకా అప్పులు చేశాడు. అప్పు తీర్చక పోతే అవమానం తప్పదు. కట్నం డబ్బులు వస్తాయని ఆశ. తన తాత కొమరయ్య తన నిశ్చితార్థానికి ముందే కాలం చేశాడు.
దీంతో ఉన్న ఒక్క ఆశ చచ్చి పోయింది. అతడి చావు సాయిలును కదిలించింది. కన్నీళ్లను తెప్పించింది. ఏమిటి బతుకు అన్న ఆలోచన.. మరణాంతరం జరిగిన పరిణామాలు చిత్రానికి హైలెట్ గా నిలిచేలా చేశాడు దర్శకుడు వేణు. చుట్టు ఏర్పర్చుకున్న కంచెలు ఎలా మనుషుల్ని కట్టి పడేస్తాయో బలగం(Balagam Comment) సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.
మసూద్ ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ ఒదిగి పోయింది. కన్నీళ్లు పెట్టించేలా చేసింది. భావోద్వేగాలను తెరకు ఎక్కించిన తీరు ఎన్నదగినది. హాస్య నటుడిగా పేరొందిన దర్శకుడిలో మరో మానీవయ కోణం కూడా ఉందని నిరూపించాడు.
ఇది ఒక్క ప్రాంతానికి చెందిన కథే కాదు..ప్రతి పల్లెలో జరిగేదే. మనుషులన్నాక కలబోతలే కాదు కన్నీళ్లు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు అవి మనల్ని పలకరిస్తాయి..పలవరించేలా చేస్తాయి. బలగం బతుకు ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. గుండెల్ని పిండేస్తుంది..కుటుంబ బంధాల కోసం బలగం. ఓ దృశ్య కావ్యం.
Also Read : జయహో చంద్రబోస్..కీరవాణి