Ball Beverage Packaging India: తెలంగాణాలో రూ.700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్‌ !

తెలంగాణాలో రూ.700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్‌ !

Ball Beverage Packaging India: తెలంగాణాలో పెట్టుబడులకు మరోసంస్థ ముందుకొచ్చింది. అల్యూమినియం టిన్నులను ఉత్పత్తిచేసే ‘బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌’ సంస్థ రూ.700 కోట్లతో యూనిట్‌ను స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. బీర్లు, శీతలపానీయాలు, పర్‌ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను ఈ సంస్థ సరఫరా చేస్తుంది. ఈ సంస్థ ఇండియా కార్పొరేట్‌ వ్యవహారాల అధిపతి గణేశన్, సంస్థ ప్రతినిధులు ఆదివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికను వివరించారు. ‘బాల్‌’ సంస్థకు రాష్ట్రంలో అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెట్టుబడులకు సంబంధించి పూర్తిప్రణాళిక సమర్పించాలని సూచించారు.

Ball Beverage Packaging India…

రాష్ట్రంలో ‘బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌(Ball Beverage Packaging India)’ సంస్థ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో బీర్ల ప్యాకేజింగ్‌లో టిన్నుల వాడకం 25 శాతం వరకు ఉందని, రాష్ట్రంలో ఇది 2 శాతం లోపే ఉందని తెలిపారు. అవి కూడా మహారాష్ట్రలో బాట్లింగ్‌ అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్‌ చేయడానికి ఎక్సైజ్‌ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చిస్తానని తెలిపారు. 500 మి.లీ. పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్‌ చేయడం వల్ల కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కోకాకోలా సంస్థ పెద్దపల్లి జిల్లాలో రూ.1000 కోట్లతో బాట్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు గతంలో సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఆ యూనిట్‌కు ‘బాల్‌’ సంస్థ అల్యూమినియం టిన్నుల సరఫరాకు అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు.

Also Read : YS Jagan: అసెంబ్లీలో జగన్‌, రఘురామ రాజు మధ్య ఆసక్తికర సంభాషణ !

Leave A Reply

Your Email Id will not be published!