బీసీ నాయకత్వానికి రక్షణగా త్వరలో ‘బీసీ రక్షణ చట్టం’
స్థానిక సంస్థల్లో బీసీలకు 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం
అమరావతి : బీసీల రిజర్వేషన్లకు వైసీపీ ప్రభుత్వం కోత విధిస్తే, కూటమి ప్రభుత్వం 40 శాతానికి పైగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ బీసీలకు భరోసా ఇస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పునాదులు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే రాష్ట్రంలో బలహీన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పారు. గత గొడ్డలి ప్రభుత్వ పాలనలో బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వంలో చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాల ఫలితంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 40 శాతానికి పైగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ జేస్తున్నానన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు బలహీన వర్గాలు అనేక ప్రాంతాల్లో ఆధిపత్య వ్యవస్థల కింద అణచివేతకు గురయ్యాయని కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థను తీసుకొచ్చి బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం కల్పించిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుదేనని చెప్పారు. ఎన్టీఆర్ తొలుత 20 శాతం రిజర్వేషన్లు కల్పించగా, చంద్రబాబు నాయుడు వాటిని 34 శాతానికి పెంచారని గుర్తు చేశారు. దాదాపు 1996–97 నుంచి ఈ రిజర్వేషన్లు కొనసాగుతూ వచ్చాయని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన గొడ్డలి పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి ప్రభుత్వం 2020–21లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. కావాలనే తమ అనుయాయులతో న్యాయస్థానాల్లో కేసులు వేయించి, సరైన న్యాయవాదులను నియమించకుండా, తగిన వాదనలు వినిపించకుండా వ్యవహరించారని విమర్శించారు.
సొంత కేసుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే జగన్ బీసీల రిజర్వేషన్ల విషయంలో మాత్రం చిత్తశుద్ధి చూపలేదన్నారు. బలహీన వర్గాలు నాయకులు కానీ, బలహీన వర్గాల ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీతో ఉన్నారనే అక్కసుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల కోత కారణంగా సుమారు 16,800 మంది బీసీలు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో పొందాల్సిన పదవులను కోల్పోయారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. బీసీలను రాజకీయంగా అణచి వేయాలనే ఆలోచనతోనే గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక దృష్టి సారించి, రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రత్యేక డెడికేటేడ్ కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు. గత ప్రభుత్వం కనీసం ప్రత్యేక కమిషన్ను కూడా నియమించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కమిషన్ ద్వారా సర్వే నిర్వహించి, నివేదిక సిద్ధం చేసి రిజర్వేషన్ల అంశంపై ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 16వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు రూ.12,500 కోట్ల నిధులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.
