Bhu Bharati: తెలంగాణాలో అమల్లోకి వచ్చిన భూ భారతి పోర్టల్ సేవలు
తెలంగాణాలో అమల్లోకి వచ్చిన భూ భారతి పోర్టల్ సేవలు
Bhu Bharati : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి(Bhu Bharati) పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్ లో పది మాడ్యూల్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు, ఇతరాల పేరిట ప్రత్యేక మాడ్యూల్స్‌ను పొందుపరిచారు. పోర్టల్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. తెలంగాణ రాజముద్ర, తెలంగాణ రైసింగ్ లోగోలు, ప్రతి మాడ్యుల్లో ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణ తల్లితో కూడిన లోగోను పొందుపరిచారు. నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించిన ఈ భూభారతి పోర్టల్ ను… జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
Bhu Bharati Portal in Telangana
తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ ను అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగానే తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న తపనతోనే ఈ చట్టాన్ని వారికి అంకితం చేస్తోందన్నారు. భూభారతి పోర్టల్ ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘తెలంగాణ(Telangana) ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. నాడు కుమురం భీం ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరాటం చేసినా… నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటం చేసినా భూమితో వారికున్న అనుబంధం నుంచి పుట్టుకొచ్చినవే. ఆ పోరాటాల నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భావించారు. భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా బూర్గుల రామకృష్ణారావు దగ్గరి నుంచి పీవీ నరసింహారావు వరకు చేపట్టిన భూసంస్కరణలే గుర్తుకొస్తాయి. సీలింగ్ చట్టం తీసుకొచ్చి… జమీందార్లు, జాగీర్దార్ల నుంచి లక్షల ఎకరాలు తీసుకొని పేదలకు ఆత్మగౌరవం తెచ్చేలా పంచింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. దాదాపు 65 ఏళ్లు 69 లక్షల భూకమతాలకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ సిబ్బందే కాపాడారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నఫళంగా రెవెన్యూ చట్టాలను మార్చాలని పాలకుల మెదడులో కలిగిన ఆలోచనతో ప్రవేశపెట్టిన ధరణి ఒక పీడకలలా మారింది. ఒక తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలపెట్టే పరిస్థితి వచ్చింది. ధరణితో వచ్చిన మార్పులు ఇబ్రహీంపట్నంలో జంట హత్యలకు కారణమయ్యాయి. సిరిసిల్లలో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ మహిళ తన తాళిబొట్టును లంచంగా ఇచ్చింది. ఈ సమస్యలన్నింటికీ రెవెన్యూ సిబ్బందే కారణమని చెప్పి నాటి పాలకులు వారిని దోషులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించారు. గత ప్రభుత్వ హయాంలో చట్టాలను కొందరికే చుట్టాలుగా మార్చి వేల ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం జరిగింది వాస్తవం కాదా? అందుకే మేం అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని చెప్పాం. పేదలకు చుట్టంగా ఉండాలనే ఈరోజు నూతన ఆర్‌ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చాం. కోదండరెడ్డి నేతృత్వంలో వివిధ రాష్ట్రాల్లోని చట్టాలపై అధ్యయనం చేయించాం. నిజాం కాలం నుంచి అమలైన చట్టాలనూ పరిశీలించిన తర్వాతే భూ భారతిని తెచ్చాం. రెవెన్యూ అధికారులు ముందుగా నాలుగు పైలట్ మండలాల్లోని గ్రామాలకు వెళ్లి ప్రజల నుంచి సమాచారం సేకరిస్తారు.
మనిషికి ఆధార్… భూమికి భూధార్
మనిషికి ఆధార్ కార్డులాగే భూమికి భూధార్ తెచ్చాం. ప్రతి కమతానికో నంబరు ఇద్దాం. ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు… వ్యవసాయ భూముల్ని పక్కాగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుంది? రాబోయే రోజుల్లో భూములకు పక్కాగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో రెవెన్యూశాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునే బాధ్యత మనందరిది అని మంత్రి పొంగులేటి అన్నారు.
Also Read : Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్