Bronze Statue for PM Modi: ప్రధాని మోదీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ !

ప్రధాని మోదీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ !

Bronze Statue for PM Modi: అస్సాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నవీన్‌ చంద్ర బోరా… ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని విభిన్నంగా చూపించబోతున్నారు. సుమారు రూ.200 కోట్ల సొంత ఖర్చుతో 190 అడుగుల ప్రధాని మోదీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. పీఠభాగంతో కలుపుకొని సుమారు 250 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మోదీ కాంస్య విగ్రహం మెడలో అస్సాం సంస్కృతికి చిహ్నంగా గమోసా (అస్సామీలు ధరించే ఖద్దరు కండువా) కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ కాంస్య విగ్రహం నిర్మాణానికి గువాహటి నగరం జలుక్‌బారిలోని ప్రధాన బస్టాండ్ సమీపంలో ఉన్న తన స్థలంలో భూమిపూజ ప్రారంభించారు. మూడు రోజుల పాటు సాగే ఈ పూజా కార్యక్రమాన్ని నవీన్ చంద్ర బోరా తన చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వివరాలతో గతేడాది ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు నవీన్ చంద్ర తెలిపారు.

Bronze Statue for PM Modi Viral

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… గువాహాటికి చెందిన నవీన్ చంద్ర బోరాకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అంటే వల్లమాలిన అభిమానం. ఓ విషయంలో 2016లో మోదీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న నవీన్ చంద్ర… అప్పుడే ప్రధాని కోసం ఓ భారీ విగ్రహాన్ని నెలకొల్పాలనుకున్నారు. అయితే ఈ విగ్రహాం నిర్మాణానికి ఎటువంటి విరాళాలు తీసుకోకుండా స్వంత ఖర్చుతో నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తన స్వంత స్థలంలో సుమారు రూ.200 కోట్లతో 190 అడుగుల ఎత్తైన మోదీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసారు. ఈ విగ్రహాం ఏర్పాటుకు సంబంధించి తుది డిజైన్, ప్లాన్ కూడా సిద్ధం చేసి… విగ్రహ ఏర్పాటు, దానికోసం ఖర్చుచేస్తున్న మొత్తం ఎలా సమకూరుతుందనే వివరాలతో పీఎంఓకి లేఖ రాసారు. అంతేకాదు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ స్వయంగా హాజరవుతారని ఆశిస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా నవీన్ చంద్ర బోరా మాట్లాడుతూ… “ప్రపంచంలోని అత్యుత్తమ ప్రధానులలో నరేంద్ర మోదీ(PM Modi) ఒకరు. 2016లో ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్న రోజునే అతనికి విగ్రహం నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ఈ విగ్రహం కూడా నా స్వంత స్థలంలో, స్వంత ఖర్చుతో నిర్మించాలనుకున్నారు. దీనికోసం విగ్రహం డిజైన్, ప్లాన్, ఖర్చు, నా ఆదాయ మార్గాల వివరాలతో పీఎంఓకు లేఖ రాసాను. ఇందుకోసం సుమారు రూ.200 కోట్లను జమ చేశాను. 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహ తయారీ కోసం 60 అడుగుల పునాదినీ తీయించాను. మొత్తంగా పునాదితో కలుపుకొని విగ్రహం ఎత్తు 250 అడుగులు’ ఉంటుంది. ఇంత భారీ విగ్రహం మెడపై అసోం సంస్కృతికి చిహ్నంగా నిలిచే గమోసా డిజైన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాను. మోదీ(PM Modi) విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేను ఎంతో అదృష్టవంతుడ్ని… ఆయనపై నాకున్న ప్రేమతోనే ఇది చేస్తున్నానని వ్యాపారవేత్త నవీన్​ చంద్ర బోరా తెలిపారు.

Also Read : Rajya Sabha Elections 2024 : సోనియా, ప్రియాంక గాంధీ..వీరిద్దరిలో రాజ్యసభకు ఎన్నికయ్యేది ఎవరు..?

Leave A Reply

Your Email Id will not be published!