Buddha Venkanna: చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న !
చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న !
Buddha Venkanna: టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న… టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీకు అభిషేకం నిర్వహించారు. అయితే అదేదో నీరు, పాలు, నూనె, నెయ్యి, పంచామృతాలతో కాదు… రక్తంతో అభిషేకం నిర్వహించారు. అలా అని జంతుబలి కూడా ఏమీ ఇవ్వలేదు. తన శరీరంలో రక్తాన్ని తీసి.. చంద్రబాబు ఫ్లెక్సీకు రక్తాభిషేకం నిర్వహించారు. అనంతరం రక్తంతో గోడపై ‘‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’’ అంటూ రాశారు. ప్రస్తుతం బుద్ధా వెంకన్న(Buddha Venkanna) చేసిన రక్తాభిషేకం… సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు… రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే బుద్దా వెంకన్న మాత్రం… చంద్రబాబుపై తన అభిమానంతో పాటు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేసారు.
Buddha Venkanna Viral
ఈ సందర్భంగా బుద్దా వెంకన్న(Buddha Venkanna) మాట్లాడుతూ… ‘‘ నా దారిద్య్రానికి కేశినేని నాని వచ్చి… నన్ను పశ్చిమ నియోజకవర్గ నుంచి తీసేసి వేరే వాళ్లని పెట్టాలని కోరాడు. అప్పుడు చంద్రబాబు నాకు విజయవాడ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. 6 ఏళ్లు పని చేశాను. మూడు జిల్లాలకు ఇంచార్జిగా చంద్రబాబు నన్ను నియమించారు. చంద్రబాబుపై దాడి జరిగితే ఎవడూ మాట్లాడలేదు. నేను పోరాటం చేశాను. జోగి రమేశ్ పై గొడవకు వెళ్లనప్పుడు సొమ్ము సిల్లి పడిపోయాను. పశ్చిమ నియోజకవర్గం తప్ప అన్ని స్థానాల్లో ఐవీఆర్ నిర్వహస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గతంలో చంద్రబాబుకి, లోకేశ్ కి చెప్పాను. అసెంబ్లీలో చంద్రబాబు వెనుక కూర్చోవాలనేది నా కోరిక.
‘‘చంద్రబాబు కుటుంబం తప్ప వేరే ఎవరూ నాకు నాయకులు కాదు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. పార్టీ కోసం నిలబడే వాళ్లకు అవకాశం ఇవ్వాలి. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి పార్లమెంట్ అడుగుతున్నాను. నాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను. నా ప్రాణం చంద్రబాబు.. నా రక్తంతో కాళ్లు కడిగి ప్రేమ చూపించా. నేను కొడాలి నాని, వంశీ, కేశినేని నాని టైప్ కాదు. నా రక్తం మొత్తం చంద్రబాబే. నా గుండె కోసి మీ టేబుల్ మీద పెట్టగలను. ఎవరి మీదకైనా దూకేశక్తి, సైన్యం నాకు ఉంది. పార్టీలో ఉండి విన్నా… వినిపించనట్టుగా నటించే మూగోళ్లు, చెవిటోళ్లు ఉన్నారు. చంద్రబాబుపై వైసీపీ విమర్శలు చేస్తే ఒక్కడు మాట్లాడరు.
చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా సీబీఎన్ జిందాబాద్ అనే అంటాను. ఇది అభిమానమే… బ్లాక్ మెయిలింగ్ కాదు. ఇక నా పని తీరు, స్వామి భక్తి ఎలా నిరూపించుకోవాలి. నాకు సీటు ఇచ్చి చట్ట సభల్లో అడుగు పెట్టించాలని కోరుతున్నా. ఇది నా విన్నపం, విజ్ఞప్తి మాత్రమే. నాలో ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు కుటుంబం తోనే నా ప్రయాణం’’ అంటూ బుద్ధా వెంకన్న భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read: CM YS Jagan: రాప్తాడు వేదికగా టీడీపీ, జనసేన పార్టీలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ !