Bhadrachalam: భద్రాచలంలో కూలిన ఐదంతస్తుల భవనం ! కొనసాగుతున్న సహాయక చర్యలు !
భద్రాచలంలో కూలిన ఐదంతస్తుల భవనం ! కొనసాగుతున్న సహాయక చర్యలు !
Bhadrachalam : భద్రాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఐదు అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయింది. భద్రాద్రి రామయ్య ఆలయానికి కూతవేటు దూరంలో (సూపర్ బజార్ సెంటర్‌లో) ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనలో ఒక తాపీ కార్మికుడు మృతిచెందగా మరొకరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. బుధవారం మధ్యాహ్నం 2.40గంటల సమయంలో భవనం కుప్పకూలటంతో(Building Collapsed) తాపీ పనులు చేస్తున్న చల్ల కామేశ్ (48)(Challa Ramesh), ఉపేందర్ అందులో చిక్కుకుపోయారు. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ ఘటనా స్థలానికి చేరుకుని… రెస్క్యూ బృందాలను రప్పించి యంత్రాల సాయంతో శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. శిథిలాలను తొలగించేందుకు యత్నిస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు, స్లాబ్ కూలాయి. దానిపై మిగిలిన అంతస్తుల స్లాబ్ లు పేర్చినట్లు పడిపోయాయి. పిల్లర్లు 9 అంగుళాల మందంతో ఉండటంతో శిథిలాల తొలగింపు కష్టతరంగా మారింది.
గ్రౌండ్ ఫ్లోర్‌లో కామేశ్ సహాయం కోసం కేకలు వేయడంతో వైద్యబృందాలను అప్రమత్తం చేశారు. పైపుల ద్వారా ఆక్సిజన్ పంపించారు. కూలిన స్లాబ్ కిందకు కుంగిపోకుండా జాకీలను ఉంచారు. బుధవారం రాత్రి 1.45 గంటల సమయంలో కామేశ్‌ను బయటకు తీసుకొచ్చి ఆక్సిజన్ సిలిండర్ అమర్చి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలై రక్తస్రావం కావటంతో కామేశ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు ఉపేందర్ ఆచూకీ లభ్యం కాకపోవటంతో అతడి కుటుంబీకులు కలెక్టర్ వాహనాన్ని ఘటనాస్థలి వద్ద అడ్డుకుని నిరసన వ్యక్తం చేసారు. అయితే పోలీసుల జోక్యంతో శాంతించారు. ఉపేందర్ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Bhadrachalam – నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతోనే?
శ్రీపతి నేషనల్ సేవా ట్రస్టుకు చెందిన శ్రీ విజయ కనకదుర్గ భవానీ దేవస్థానం భద్రాద్రి భవానీ పేరుతో అక్కడ భవన (గుడి) నిర్మాణం చేపట్టింది. సుమారు 35 ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటిపైనే సామర్థ్యానికి (జీ+1కు అనుమతి) మించి జీ+5 నిర్మాణం చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తగా… అధికారులు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. దీనితో కొద్దినెలల పాటు పనులను నిలిపివేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవటంతో ఇటీవల తాపీ పనులు ప్రారంభించారు. జగదీశ్ కాలనీకి చెందిన చల్లా కామేశ్, లంబాడీ కాలనీకి చెందిన పడిశాల ఉపేందర్ తాపీపనికి వెళ్లినట్లు తెలిసింది. ఒక్కసారిగా భవనం పేక మేడలా కూలి పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వీరిద్దరే వెళ్లారా? మరికొందరు ఉన్నారా అనేది స్పష్టత లేదు. అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమంటూ గిరిజన సంఘాల నాయకులు ఆందోళన చేశారు. శ్రీపతి దంపతులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
కొనసాగుతున్న సహాయక చర్యలు
భద్రాచలం(Bhadrachalam)లో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 18 గంటలుగా క్రేన్లు, పొక్లెయిన్లతో శిథిలాలను సిబ్బంది తొలగిస్తున్నారు. గ్యాస్ కట్టర్, క్రేన్లు, పొక్లెయిన్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాపీ మేస్త్రి ఉపేందర్ బుధవారం నుంచి శిథిలాల్లోనే చిక్కుకున్నారు. అతడిని కాపాడాలని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఉపేందర్‌ను గుర్తించేందుకు జాగిలాలను సహాయక బృందాలు పంపాయి. శిథిలాల కింద కామేశ్వరరావు అనే వ్యక్తి చిక్కుకోగా అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా… అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.
Also Read : Paper Leakage: 10th పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో విద్యార్థిని పిటిషన్