CAA: పాక్, బంగ్లా, అఫ్గాన్ మైనార్టీలకు ఊరట కల్పించిన కేంద్రం ప్రభుత్వం
పాక్, బంగ్లా, అఫ్గాన్ మైనార్టీలకు ఊరట కల్పించిన కేంద్రం ప్రభుత్వం
CAA : పౌరసత్వ నిబంధనలను సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మైనార్టీలకు భారీ ఊరట కల్పించినట్లయింది. వివిధ రకాల కారణాలతో డిసెంబరు 31, 2024 తేదీ లోపు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద పాస్‌పోర్టు, ఇతర పత్రాలు లేకపోయినా వారు భారత్‌లో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఆయా దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పిస్తామని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే గతేడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA) ప్రకారం… 2014 డిసెంబరు 31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా ఈ పౌరసత్వ నిబంధనలకు సడలింపులు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
CAA Important Updates
పౌరసత్వ సవరణ చట్టం(CAA) 2025లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో మతపరమైన హింసల కారణంగా భయంతో డిసెంబరు 31, 2024 తేదీలోపు భారత్‌ను ఆశ్రయించిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు లేకపోయినా భారత్‌లో నివసించవచ్చు. ఇకపై వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. దశాబ్దాలతరబడి కాందిశీకుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. దేశంలో ఎక్కడికైనా వారు రాకపోకలు సాగించొచ్చు. ఆస్తులు కొనవచ్చు.’’ అని హోంశాఖ వెల్లడించింది.
ఏమిటీ సీఏఏ నిబంధనలు ?
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది పౌరసత్వ సవరణ చట్టం-2019 ని అమల్లోకి తెచ్చింది. సీఏఏ-2019 చట్టం ప్రకారం… పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్రం నిబంధనల్ని రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది.
Also Read : Yuvraj Rabha: చదువుకోసం గుర్రంపై స్కూలుకెళ్తున్న గిరిజన విద్యార్ధి
