Yuvraj Rabha: చదువుకోసం గుర్రంపై స్కూలుకెళ్తున్న గిరిజన విద్యార్ధి

చదువుకోసం గుర్రంపై స్కూలుకెళ్తున్న గిరిజన విద్యార్ధి

Yuvraj Rabha : అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలో కూడా అడవి బిడ్డలకు కనీస అవసరాలు కానరావడం లేదు. విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి కనీస అవసరాలకోసం కూడా రోజూ కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అస్సాం- మేఘాలయ సరిహద్దుల్లోని ఓ మారుమూల గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేకపోవడంతో… చదువుకోసం మూడో తరగతి విద్యార్ధి రోజూ గుర్రాన్ని స్వారీ చేసుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు. రోజూ దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో గుర్రంపై స్వారీ చేసుకుంటూ చదువుకోసం వెళ్తున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Yuvraj Rabha Viral

అస్సాం (Assam)- మేఘాలయ సరిహద్దుల్లోని మారుమూల గ్రామం బార్బకర్‌ లో యువరాజ్ రభా (Yuvraj Rabha) అనే ఏనిమిదేళ్ళ విద్యార్ధి నివసిస్తున్నాడు. అతడు సౌత్‌ పాంటన్‌ ట్రైబల్‌ మిడిల్‌ ఇంగ్లీష్ స్కూల్‌ లో మూడో తరగతి చదువుతున్నాడు. దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉండే ఆ పాఠశాలకు చేరుకోవాలంటే… రోజూ అడవిలోంచి వెళ్లాల్సిందే. సరైన రహదారి సదుపాయం కూడా లేదు. బస్సు, వ్యాను కాదు కదా.. సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. దీనితో కొడుకు కోసం యువరాజ్‌ తండ్రి ఓ గుర్రాన్ని ఏర్పాటు చేశాడు. గుర్రం స్వారీపై శిక్షణ కూడా ఇప్పించాడు. దీనితో ఆ విద్యార్థి ప్రతిరోజు ఆ గుర్రాన్ని స్వారీ చేసుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు. అతడు అలా గుర్రం స్వారీ చేసుకుంటూ వెళ్లడం… అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చదువుకోవాలనే ఆశతో యువరాజ్ గుర్రం స్వారీ చేసుకుంటూ రోజూ పాఠశాలకు వెళ్తున్నాడు.

అయితే అతడి భద్రతపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, యువరాజ్‌ గుర్రం స్వారీ చేయడం చూసి… వారు కూడా ఆశ్చర్యపోయారు. రవాణా సదుపాయం లేకపోవడం కారణంగా ఆ మారుమూల ప్రాంతంలోని పిల్లలు చదువుకు దూరమవుతున్నారని పాఠశాలలోని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కానీ, యువరాజ్‌ తండ్రి ఆలోచన.. అతడిని చదువుకు దగ్గర చేసిందన్నారు. ఈ సందర్భంగా ఈ మార్గంలో మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది మరింత మంది చిన్నారులను విద్యకు దగ్గర చేస్తుందని పేర్కొన్నారు.

Also Read : Goa Governor: రుషికొండ ప్యాలెస్‌ ను మానసిక వైద్యశాలగా మార్చాలి – గోవా గవర్నర్‌

Leave A Reply

Your Email Id will not be published!