విద్యార్థుల నిరసనలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో విద్యార్థుల నిరసనలపై వాయిదా తీర్మానం బుధ‌వారం ప్ర‌వేశ పెట్టింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా, రాజ్యాంగ పరమైన బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, ఇతర సభ్యులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తన హయాంలో జరిగిన పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర విద్యా శాఖ మంత్రి స్వయంగా వివరణ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం నీట్, సీబీఎస్ఈ సమస్యలు, పరీక్షల కారణంగా జరిగిన ఆత్మహత్యలతో పాటు విద్యా రంగంలోని సంక్షోభంపై చర్చించాలని అన్నారు. నిన్న శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, యువతపై నమోదైన కేసులన్నింటినీ ఉప సంహరించు కోవాలని డిమాండ్ చేశారు స‌భ సాక్షిగా.

పేపర్ లీక్ ఘటనలలో చెప్పుకోదగ్గ అరెస్టు ఒక్కటి కూడా జరగలేదని ఆయన నొక్కి చెప్పారు. ఈ మోసం ఎంత పెద్దదైనప్పటికీ, బాధ్యులైన వ్యక్తులు, కోచింగ్ సిండికేట్లు లేదా అధికారులపై ఒక్క అర్థవంతమైన అరెస్టు లేదా క్రిమినల్ చర్య కూడా తీసుకోలేదని ప్ర‌శ్నించారు. అంతే కాకుండా భారతీయ విద్యార్థులకు పదేపదే విఫలమైన పరీక్షా విధానానికి అధిపతిగా ఉన్నప్పటికీ ఎందుక‌ని చ‌ర్య‌లు తీసుకోలేక పోయారో చెప్పాల్సిన బాధ్య‌త కేంద్ర మంత్రిపై ఉంద‌న్నారు కేసీ వేణుగోపాల్. మంత్రిత్వ బాధ్యత అనే ప్రాథమిక సూత్రాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ, ఎటువంటి జవాబుదారీతనం లేకుండా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవిలో కొనసాగుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్లమెంటు సమీపంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన చర్యలపై చర్చ కోసం కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ లోక్‌సభలో వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!