PM-Surya Ghar Muft Bijli Yojana: ‘పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !

‘పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !

PM-Surya Ghar Muft Bijli Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రూ.75,021 కోట్లతో 2023-24 నుంచి 2026-27 వరకు నాలుగేళ్లు నడిచే ఈ పథకానికి ఆమోద మద్ర వేసారు. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా కోటి కుటుంబాలు ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు వినియోగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసారు. ‘పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన(PM-Surya Ghar Muft Bijli Yojana)’ పేరుతో అమలుచేసే ఈ పథకానికి రాయితీని రెండు భాగాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది.

ఈ పథకం క్రింద 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీను ప్రభుత్వం ప్రకటించింది. మూడు కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా రూ.78వేలు అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఎటువంటి పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది.

PM-Surya Ghar Muft Bijli Yojana – ‘పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన’ పథకం అంటే ఏమిటి ?

పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారత్‌ స్వావలంబన దిశగా పయనించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన(PM-Surya Ghar Muft Bijli Yojana)’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం క్రింద దేశ వ్యాప్తంగా సుమారు కోటి మంది తన ఇంటి పై భాగంలో సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్ ను వినియోగించుకోవచ్చు. ఈ సోలార్ రూఫ్ టాప్ యూనిట్ లను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వినియోగదారునికి లబ్ధి చేకూర్చుతుంది.

ఈ పథకం క్రింద రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ను ఏర్పాటు చేసుకునే వినియోగ దారులకు ఒక కిలో వాట్‌ వ్యవస్థకు రూ.30 వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల వ్యవస్థకు రూ.78 వేల చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు రాయితీ సొమ్ము కోసం నేషనల్‌ పోర్టల్‌ https:// pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే కంపెనీని పోర్టల్‌ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చే రాయితీ మినహా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే అవకాశం కూడా కేంద్రం కల్పించింది.

ప్రతీ జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్ ఏర్పాటుకు కేంద్రం అదేశం !

సౌర విద్యుత్‌ పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి జిల్లాలో ఒక మోడల్‌ సోలార్‌ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు రూఫ్‌ టాప్‌ సోలార్‌ పథకాన్ని ప్రమోట్‌ చేసే పట్టణ స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్‌ సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌ టాప్‌ సోలార్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పథకం ద్వారా కొత్తగా 17 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ పథకం ద్వారా ఉత్పత్తి అయ్యే దాంట్లో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్‌ మీటరింగ్‌ ద్వారా తిరిగి ప్రభుత్వానికి విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకు రూ.1,265 ఆదాయం వస్తుంది. అందులో రూ.610ని బ్యాంకు రుణవాయిదా కింద జమ చేసుకుంటారు. దీనివల్ల బ్యాంకు రుణం తీసుకున్న వినియోగదారులు ఏడేళ్లలో ఆ రుణాన్ని తీర్చడానికి అవకాశం ఉంటుంది.

Also Read : Anant Radhika Wedding : అనంత్ అంబానీ రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ట్రంప్ కూతురు ఇవాంకా

Leave A Reply

Your Email Id will not be published!