Arvind Kejriwal: కేజ్రీవాల్‌ పై సీబీఐ సంచలన ఆరోపణ !

కేజ్రీవాల్‌ పై సీబీఐ సంచలన ఆరోపణ !

Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పై సీబీఐ సంచలన ఆరోపణల చేసింది. ఈ కేసులో విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నట్లు రిమాండ్‌ దరఖాస్తులో ఫిర్యాదు చేసింది. మూడు రోజుల కస్టడీ విచారణ ముగియడంతో శనివారం సీబీఐ ఆయనను కోర్టులో హాజరుపరిచింది. విచారణ కొనసాగుతున్న దృష్ట్యా ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన కేజ్రీవాల్‌ను మరో 14 రోజులు జైలులో ఉంచాల్సిన అవసరముందని కోర్టుకు విన్నవించింది. ఆయన సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.

Arvind Kejriwal CBI Allegattions

అలాగే ఢిల్లీలో మద్యం వ్యాపారానికి సంబంధించిన వివిధ వాటాదారులతో తన సహాయకుడైన విజయ్‌ నాయర్‌ జరిపిన సమావేశాలకు సంబంధించి కేజ్రీవాల్‌ ఎటువంటి సమాధానాలు ఇవ్వడం లేదని తెలిపింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులతో జరిపిన భేటీలపై కూడా సరైన వివరణ ఇవ్వలేకపోయినట్లు పేర్కొంది. మరికొన్ని కీలకమైన సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉందని, దస్తావేజులను సేకరించాల్సి ఉన్నట్లు సీబీఐ కోర్టుకు నివేదించింది. ఈ అభ్యర్థనలను ఆమోదిస్తూ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను జులై 12 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతున్నట్లు ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ ముగియగానే ఆయనను మళ్లీ కోర్టులో హాజరుపరచాల్సిందిగా ప్రత్యేక జడ్జి సునేనా శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘నిందితుడి (కేజ్రీవాల్‌)పై ఆరోపించిన అభియోగాల మేరకు మద్యం పాలసీ రూపకల్పన, అమలులో పెద్దసంఖ్యలో ఇతర వ్యక్తులు కూడా ఉన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నాం. అక్రమంగా సంపాదించిన డబ్బును వినియోగించడంలో సహాయకులుగా వారంతా వ్యవహరించారు. కాబట్టి, జ్యుడీషియల్‌ కస్టడీకి ఆదేశించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నాం’’ అని జడ్జి ఆదేశాల్లో పేర్కొన్నారు.

Also Read : ICC Men’s T20 World Cup: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విజేతలకు దక్కిన ప్రైజ్‌మనీ తెలుసా ?

Leave A Reply

Your Email Id will not be published!