Supreme Court: వీధి కుక్కల సమస్యపై సుప్రీం తీర్పును ఆక్షేపిస్తున్న ప్రముఖులు

వీధి కుక్కల సమస్యపై సుప్రీం తీర్పును ఆక్షేపిస్తున్న ప్రముఖులు

Supreme Court : దిల్లీ, ఎన్సీఆర్‌లలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. రోజు రోజుకు మనం సైన్స్‌, మానవత్వం లేని ప్రాచీన యుగంలోకి వెళ్లిపోతున్నట్లుగా ఉందన్నారు. మూగజీవాలైన కుక్కలు సమాజంలో పెద్ద సమస్య కాదని… వాటిని పూర్తిగా నిర్మూలించడం సరైన చర్య కాదని అన్నారు. కుక్కల నుంచి ప్రజలకు భద్రత కల్పించాలనుకుంటే వాటికి స్థానికంగా షెల్టర్ల ఏర్పాటు, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Supreme Court – సీజేఐకి లేఖ రాసిన సినీ ప్రముఖులు

వీధి కుక్కల అంశంలో ‘సుప్రీం’ ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని అభ్యర్థిస్తూ సినీ నటుడు అడివి శేష్‌ సుప్రీం కోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ కు లేఖ రాశారు. ఈ విషయంలో దిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. తీర్పుపై ఇప్పటికే పలు జంతు హక్కుల సంస్థలు ఆక్షేపణ తెలిపాయి. కేంద్ర మాజీమంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ సైతం ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటులు జాన్‌ అబ్రహం, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సైతం కుక్కలపై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ… బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాశారు.

అందులో వీధుల్లో ఉండే కుక్కలన్నీ ప్రజలకు హాని తలపెట్టవని… చాలా మంది ప్రజలు వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని అన్నారు. అదే విధంగా కుక్కలు కూడా ఎంతో విశ్వాసంగా ఉంటాయని తెలిపారు. కుక్కలను పూర్తిగా లేకుండా చేయడానికి బదులుగా వాటికి స్టెరిలైజేషన్‌, టీకాలు వేయించడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. నటులు వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, వీర్‌ దాస్‌ సైతం కోర్టు తీర్పుపై స్పందిస్తూ… ఇది కుక్కలకు మరణశిక్షతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు

దిల్లీ వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్‌ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ… కుక్కలను దూరంగా ఉన్న షెల్టర్లకు తరలించాలని సోమవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని… తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆదేశాలు జారీ చేశామని ధర్మాసనం పేర్కొంది. వీలైనంత త్వరగా దిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని అధికారులను అదేశించింది.

Also Read : Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్‌ రాయబారి కౌంటర్‌

Leave A Reply

Your Email Id will not be published!