Centre Suprme Court Comment : ‘గీత’ దాటుతున్నది ఎవరు
కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు
Centre Suprme Court Comment : దేశ వ్యాప్తంగా మరోసారి కొలీజియం వ్యవస్థపై చర్చ జరుగుతోంది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వం. 50వ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ వై చంద్రచూడ్ కొలువు తీరారు.
విలక్షణమైన తీర్పులకు పేరొందారు. ఎవరికీ లొంగరన్న పేరుంది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా కేంద్ర సర్కార్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం.
దేశంలో అత్యున్నతమైన వ్యవస్థగా భావించే కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో హడావుడిగా కేవలం 24 గంటల్లోపే కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ను నియమించడం. ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో(Centre Suprme Court) పిటిషన్ దాఖలైంది.
ఈ విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తింది. అంతే కాదు
కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ఎంపిక విధానాన్ని ప్రశ్నించింది. ఒక రకంగా చెంప ఛెళ్లుమనిపించేలా వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యవస్థ సీఈసీకి ఉంటుంది.
స్వయం ప్రతిపత్తి కలిగిన సర్వసత్తాక సంస్థ అది. అందులో జీ హుజూర్ అంటూ కేంద్రం ఏది చెబితే అది తలాడించే ఎన్నికల కమిషనర్లు ఉండ కూడదని సంచలన వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం.
అంతే కాదు భారత దేశ ఎన్నికల చరిత్రలో చండశాసనుడిగా పేరొందిన దివంగత చీఫ్ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ను మరోసారి గుర్తు చేసింది. ఇదే సమయంలో అలాంటి సీఈసీ కావాలని , ఉండాలని సూచించింది.
తామేమీ అరుణ్ గోయల్ ను , కేంద్రాన్ని తప్పు పట్టడం లేదని కానీ గత ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న సీఈసీ పోస్టును ఇంత కాలం భర్తీ చేయకుండా ఒక్క రోజుల్లో ఎలా ఫైల్ క్లియర్ చేశారంటూ ప్రశ్నించింది.
ఒక ఉన్నతాధికారి వీఆర్ఎస్ తీసుకునేందుకు మూడు నెలల సమయం పడుతుందని, కానీ సదరు అధికారి ఇవాళ పదవీ విరమణ చేయడం, ఆ వెంటనే
సీఈసీగా నియామకం కావడం, ఆ వెంటనే సీఈసీగా బాధ్యతలు స్వీకరించడం తమను విస్తు పోయేలా చేసిందని పేర్కొంది.
ఈ వివాదం ఇలా ఉండగానే కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కొంత కాలం నుంచి న్యాయ వ్యవస్థను
ప్రశ్నిస్తున్నారు. తీవ్ర ఆరోపణలు చేస్తూ ఇబ్బందికరంగా మారారు. ప్రపంచంలో కొలీజియం వ్యవస్థ ఎక్కడా లేదని ఒక్క భారత దేశంలో మాత్రమే ఉందన్నారు.
తాజాగా హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికకు సంబంధించి కొలీజియం సిఫారసు చేసిన న్యాయమర్తుల లిస్టును కేంద్రానికి పంపింది. ఈ ఫైల్ ను ఆమోదించకుండా ప్రభుత్వం తొక్కి పెట్టింది.
దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర సర్కార్ మధ్య యుద్దం కొనసాగుతోంది. ఇదే సమయంలో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఏకంగా న్యాయ శాఖ మంత్రిని టార్గెట్ చేశారు. నిస్సందేహంగా ఆయన లక్ష్మణ రేఖను దాటుతున్నారంటూ మండిపడ్డారు.
ఇదే సమయంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పాలనా యంత్రాంగం సరిగా లేక పోతే సరి చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంటుంది.
దేశం నడవాలంటే అన్ని వ్యవస్థలు కలిసికట్టుగా నడవాలి. లేక పోతే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితి దాపురిస్తుంది. పట్టు విడుపులకు పోకుండా మోదీ సర్కార్ సాధ్యమైనంత వరకు సర్దుకు పోతేనే సర్కార్ నడుస్తుందని గమనించాలి.