Chandrababu Naidu: అధికారంలోనికి వచ్చిన 24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తా – చంద్రబాబు
అధికారంలోనికి వచ్చిన 24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తా - చంద్రబాబు
Chandrababu Naidu: ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అమలులోనికి తేబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్… జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పెద్ద ఎత్తున విమర్శిస్తోంది. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం రూపొందించింది… కాని కూటమి నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారంటూ అధికార వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్… కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యాక్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు తమ ఎన్నికల ప్రచార సభల్లో కీలక అంశంగా తీసుకుంటున్నారు.
Chandrababu Naidu Promise
ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి, విశాఖపట్నం మహానగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) విరుచుకు పడ్డారు. ‘మన ఆస్తులు అమ్ముకోవాలన్నా జగన్ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. అందుకే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నాయకులకు విశాఖపై ప్రేమ లేదని, ఇక్కడి ఆస్తులపైనే ఉందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అమలులోనికి వస్తే వైసీపీ నాయకులు మెడపై కత్తిపెట్టి ఇక్కడి ప్రజల ఆస్తులను రాయించుకున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు(Chandrababu Naidu) మాట్లాడుతూ… ‘‘నా జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. అందుకే భయపడను. జైల్లో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు ప్రయత్నించారు. అయినా, భయపడలేదు. అక్కడ కూడా ప్రజల కోసమే ఆలోచించా. వైసీపీకు ఎదురుతిరిగారన్న కారణంతో ఎంపీ రఘురామ కృష్ణ రాజును హింసించారు. సమైక్య రాష్ట్రంలో ముఠా రాజకీయాలను తిప్పికొట్టి… రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాం. అలాంటిది ఈ తాటాకు చప్పుళ్లకు భయపడతానా? వైసీపీ అరాచకాలను అంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలి. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలి. మీ ఓటు పిల్లల భవిష్యత్ కోసమని గుర్తుపెట్టుకోవాలి.
జగన్ అధికారంలోకి వస్తే అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోతాయి. గ్రామానికో రౌడీ పుట్టుకొస్తాడు. ఈ ఐదేళ్లు ఎవరైనా బాగుపడ్డారా? ప్రజల ఆదాయం పెరగాలి. ధరలు తగ్గాలి. కానీ, రాష్ట్రంలో భిన్న పరిస్థితులు తలెత్తాయి. ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. విపరీతంగా ధరలు పెంచేశారు. కలుషిత మద్యానికి దాదాపు 31 వేల మంది బలయ్యారు. విశాఖ నగరం గంజాయి, డ్రగ్స్‌కు హబ్‌గా మారిపోయింది. ఒకే మాటను పదేపదే చెబితే నిజమైపోతుందని జగన్ అనుకుంటున్నారు. రుషి కొండకు బోడిగుండు కొట్టేశారు. అక్కడ రూ.500 కోట్లు ఖర్చుపెట్టి ప్యాలెస్ కట్టేశాడు. అక్కడికి ఎవరినీ రానివ్వడం లేదు. ఈ చర్యలు చూస్తుంటే జగన్ అహంకారం అర్థమవుతోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారు. కేంద్రంలో మోదీ గ్యారంటీలు.. ఇక్కడ సూపర్ సిక్స్ ఉన్నాయి. డ్వాక్రా మహిళలకు రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చి.. వారిని లక్షాధికారులను చేస్తా’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Also Read : Pawan Kalyan: సినీ ప్రముఖుల నుండి పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న రాజకీయ మద్దత్తు !