Chebrolu Kiran Kumar: వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్ట్
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్ట్
Chebrolu Kiran Kumar : మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి… వైఎస్ భారతిరెడ్డిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో… భారతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా… వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో… టీడీపీ కార్యకర్త కిరణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. దీనితో “నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నా. ఈ వ్యాఖ్యలు ఎలాంటి దురుద్దేశంతో చేయలేదు. క్షణికావేశంలో మాత్రమే చేశా. క్షమించండి” అంటూ కిరణ్ కుమార్(Chebrolu Kiran Kumar) మరో వీడియో విడుదల చేశాడు.
అయితే ఒక మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కిరణ్ ను టీడీపీ(TDP) నుండి సస్పెండ్ చేస్తూ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అతనిపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గుంటూరు పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. దీనితో రంగంలోనికి దిగిన గుంటూరు పోలీసులు… సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కిరణ్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
Chebrolu Kiran Kumar – కిరణ్‌పై గతంలోనూ నాలుగు కేసులు – గుంటూరు ఎస్పీ
‘‘వైఎస్ భారతిపై చేబ్రోలు కిరణ్ అసభ్యంగా మాట్లాడారు. ఉదయం మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. శుక్రవారం ఉదయం కిరణ్‌ను కోర్టులో ప్రవేశపెడతాం. కిరణ్‌పై గతంలోనూ నాలుగు కేసులున్నాయి. మాజీ మంత్రి విడదల రజనిపైనా పోస్టులు పెట్టిన కేసు ఉంది. ఉపముఖ్యమంత్రి పవన్ కుమారుడిపైనా ఒకరు పోస్టు పెట్టారు. ఈ విషయంలో గుంటూరులో కేసు నమోదు అయింది. పోస్టు పెట్టిన వారి వివరాలను ‘ఎక్స్’ వాళ్లను అడిగాం. వివరాలు తెలిశాక పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ వెల్లడించారు.
కిరణ్ టీడీపీ కార్యకర్త అయినప్పటికీ పార్టీ అధిష్ఠానం మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్ష, స్వపక్ష నేతల భార్యలు, వారి ఇళ్లలోని మహిళపై ఎవరైనా కామెంట్లు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే హెచ్చరించారు. అయినా పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేయడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కిరణ్ కుమార్ అరెస్ట్ చేసి జైలుకు పంపిచారు.
Also Read : Gorantla Madhav: మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ అరెస్ట్