#ChinnaJeeyar : భక్తుల బాంధవుడు..నడిచే నారాయణుడు చినజీయర్

రామానుజాచార్యులు అంటే జీయర్ కు అమితమైన గౌరవం . ఆయనకు ఆయనే ఆదర్శం

Chinna Jeeyar  : ఎటు చూసినా జై శ్రీమన్నారాయణ స్మరణ. వేలాది మంది భక్తులు ..లక్షలాది కళ్ళు ..ఒకే చూపై వేచి చూస్తూనే ఉన్నాయి . ఆ స్వరం కోట్లాది ప్రజలను కొన్నేళ్ల నుండీ ప్రభావితం చేస్తూనే ఉన్నది . ఇసుక వేస్తే రాలనంత నిశ్శబ్డం అక్కడ అలుముకుంది. అంతటా ఆ నారాయణుడు ఎలా ఉంటారో చూద్దామనుకుని ఉన్న వాళ్ళు కొందరైతే ..ఇంకొందరు సర్వం ఆయన కోసం అర్పించేందుకు సైతం ముందుకు వచ్చిన వాళ్ళు . అన్ని కులాలకు ..మతాలకు చెందిన వారున్నారు. ఇదంతా కథ కాదు ..ఈ కలియుగంలో ధర్మం కోసం ..అంతరించిపోతున్న విలువల పునరుద్ధరణ కోసం ..మానవులంతా ఒకే సమూహమని ..అదే అంతిమంగా మానవత్వమే తన మతమని చాటి చెబుతున్న ఆధునికత సంతరించుకున్న తేజో మూర్తి ..శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీ.

అన్నార్తులు ..అభాగ్యులు ..ఆదరణకు నోచుకోని వాళ్ళు ..సమస్యలతో వేగలేక తల్లడిల్లుతున్న ఆనాధలు ..జీవితంపై విరక్తి చెందిన వాళ్ళు అంతా ఆయన చల్లని చూపుల కోసం ఎదురు చూస్తుంటారు. సాటి మనుషుల పట్ల ..తోటి జీవుల ..ప్రాణుల పట్ల స్వామిజీకి అపారమైన ప్రేమ .అంతకంటే ఎక్కువగా ఈ ప్రకృతి అంటే వల్లమాలిన అభిమానం . అదే ఆయనను వ్యక్తి నుండి వ్యవస్థగా మార్చేలా చేసింది . దీనజనోద్ధరణే మార్గంగా ..సమాజ హితమే మతంగా ప్రవచించిన ఆచార్యుడు రామానుజాచార్యులు అంటే జీయర్ కు అమితమైన గౌరవం . ఆయనకు ఆయనే ఆదర్శం .

మనం కాసిన్ని కాసుల కోసం పోటీ పడతాం . కానీ ఆయన అన్నిటినీ ..అందరినీ ఎప్పుడో వదిలేసుకున్నారు . తన జీవితాన్ని జాతిలో జ్ఞానపు ..సేవా వెలుగులు వెలిగించేందుకు తనను తాను అర్పించుకున్నారు ..ఓ రకంగా త్యాగం చేసుకున్నారు . ఇప్పుడు స్వామిజీకి అరవై ఏళ్ళు . ఈ సమయంలో అంతా ఎందుకురా బతుకు జీవుడా అంటూ టైం పాస్ చేస్తుంటే ..స్వామీజీ మాత్రం సమాజాన్ని చైతన్యం చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారు . ఏ ప్రభుత్వం చేయలేని పనిని ..పాలకులు చేయలేని పనుల్ని ఆయన దగ్గరుండి చేసి చూపిస్తున్నారు . అందుకే ఆయన నడిచే దేవుడయ్యాడు . మనం మాత్రం మామూలు మనుషుల్లాగా ఇలా జీవం లేని ప్రాణుల్లాగా మిగిలాం .

ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు ..అడుగడుగునా భక్తి ..మూర్తీభవించిన మనుషులు ..ఎవరి లోకంలో వారున్నా .అక్కడంతా జై శ్రీమన్నారాయణ స్మరణే. ఇదంతా చినజీయర్ స్వామీజీ సాధించిన ప్రగతికి సంకేతం .ఇదే ఆదర్శం ..ఇదే కనిపించే దైవం . ప్రతి ఒక్కరిలో ఆరాధన నిండిన భావం. స్వీయ ఆరాధన ..సర్వ ఆదరణ పేరుతో స్వామీజీ యాత్ర సాగుతోంది . బదరీనాథ్ లోని అష్టాక్షరీ క్షేత్రం , తిరుమల , హృషీకేశ్ , శ్రీరంగం, మేల్కోట, భద్రాచలం , నడిగడ్డపాలెం , సీతానగరం ప్రాంతాల్లో నిత్యం అన్నదానం జరుగుతోంది . మార్టూరు లో జీవన్ వికాస్ పేరుతొ పదో తరగతి దాకా ఇక్కడ పిల్లలు చదువుకుంటారు . కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన యోధులకు లక్ష చొప్పున విరాళం అందించారు .

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్వామీజీ భక్తులు పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు . శ్రీ కూర్మం నుండి పూరీ దాకా అనావృష్టి నివారణ కోసం చిన జీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో వేద పాదయాత్ర చేపట్టారు . కురుక్షేత్రం నుండి పంజాబ్ లోని బాటలా వరకు ఉగ్రవాద నివారణ కోసం పాదయాత్ర నిర్వహించారు . సామూహిక విరాట్ విష్ణు సహస్ర నామ పారాయణాన్ని సమాజ చైతన్యం కోసం 1994 నుండి భక్తులు జపిస్తూనే ఉన్నారు . కోట్లాది మంది ఇందులో పాల్గొంటున్నారు . గుంటూరు లో 1998 లో నిర్వహించిన విరాట్ పారాయణంలో ఏకంగా 8 లక్షల మంది భాగస్వాములయ్యారు . ఇది ఒక రికార్డ్ గా చెప్పుకోవాలి . 1996 లో కోనసీమలో తుఫాన్ కారణంగా అన్నీ కోల్పోయిన వారిని ఆదుకున్నారు .

No comment allowed please