#TrumpShock : చైనా షావోమీ కి ట్రంప్ షాక్

ఆఖ‌రి రోజుల్లో ట్రంప్ 9 చైనా కంపెనీలపై బ్యాన్

Trump Shock : అత్యంత వివాద‌స్ప‌ద‌మైన ప్రెసిడెంట్ గా వినుతికెక్కిన ప్ర‌స్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. త‌న ప‌ద‌వీ కాలం ముగుస్తున్న చివ‌రి రోజుల్లోనూ చైనాను విడిచి పెట్ట‌డం లేదు మ‌నోడు. ఆయ‌న అధ్య‌క్షుడిగా ఉన్నంత కాలం చైనాతో క‌య్యానికి కాలు దువ్వారు. దాని ఆర్థిక మూలాల‌పై దెబ్బ కొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. కానీ చైనా మాత్రం అద‌ర లేదు. బెద‌ర లేదు. నువ్వు మ‌మ్మ‌ల్ని నిషేధిస్తే మేం మిమ్మ‌ల్ని రానీయ‌మంటూ హుకూం జారీ చేసింది. చివ‌ర‌కు అమెరికా, చైనా దేశాల మ‌ధ్య యుద్ధం వ‌స్తుందేమోన‌న్న భ‌యాందోళ‌న‌కు ప్ర‌పంచం గురైంది.

స్మార్ట్ ఫోన్ల త‌యారీలో ఆపిల్, శాంసంగ్ కంపెనీల‌తో పోటీ ప‌డుతూ మొబైల్ మార్కెట్ లో దూసుకు పోతున్న షావోమీ ( రెడ్ మీ ) కంపెనీపై ట్రంప్ క‌న్నెర్ర చేశాడు. తాజాగా మ‌రో తొమ్మిది చైనీస్ కంపెనీల‌పై ఆంక్ష‌లు విధిస్తూ షాకిచ్చారు. షావోమీ కార్పొరేష‌న్ తో పాటు చైనాలో మూడో అతి పెద్ద చ‌మురు సంస్థ సీఎన్‌వోవోసీ, క‌మ‌ర్షియ‌ల్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేష‌న్ ఆఫ్ చైనా, స్కైరీజ‌న్ త‌దిత‌ర కంపెనీల‌పై వేటు వేశారు. ఈ కంపెనీల‌ను బ్లాక్ లిస్టులో పెడుతున్న‌ట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

ఈ కంపెనీల్లో అమెరిక‌న్ ఇన్వెష్ట‌ర్లు త‌మ‌కేమైనా పెట్టుబ‌డులు ఉంటే వాటిని ఈ ఏడాది నవంబ‌ర్ లోగా ఉప‌సంహ‌రించు కోవాల‌ని కోరారు. దక్షిణ చైనా స‌ముద్రంలో చైనా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో దానికి ప్ర‌తీకారంగా అమెరికా ఈ చ‌ర్య‌కు దిగింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 60 కంపెనీల‌ను అమెరికా బ్లాక్ లిస్టులో ఉంచింది. కాగా చైనా మిల‌ట‌రీతో త‌మ కంపెనీకి ఎలాంటి సంబంధాలు లేవంటూ షావోమీ వెల్ల‌డించింది. నిబంధ‌న‌ల‌కు లోబ‌డి వాణిజ్య కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది.

 

No comment allowed please