Citizenship Amendment Act: ‘సీఏఏ’ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం !
‘సీఏఏ’ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం !
Citizenship Amendment Act: లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 2019 డిసెంబర్ లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. అయితే పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు ఇంతవరకు జరగలేదు.
అయితే సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. బీజేపీయేతర(BJP) పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ నిరసన జ్వాలల్లో సుమారు 100 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ పలు రాష్ట్రాలు శాసన సభలో తీర్మానం కూడా చేశాయి. లోక్ సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది.
‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ ప్రకారం… పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ నిబంధనల్ని రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే ముగుస్తుంది. తాజాగా కేంద్రం నిబంధనలు నోటిఫై చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో… ఈ చట్టం అమలులోకి వచ్చినట్లైంది.
Citizenship Amendment Act – ‘సీఏఏ’ అమలు దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసిన కేంద్రం
సీఏఏ నిబంధనల్ని కేంద్రం నోటిఫై చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈశాన్య ఢిల్లీలోని షాహీన్‌బాగ్, జామియా, ఇతర సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను కొన్ని చోట్ల మోహరించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేక ఆందోళనల్లో 2020లో దిల్లీలో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసారు.
Also Read : MLC Kavitha : సీఎం రేవంత్ కు దళితులను అవమానించడం అలవాటుగా మారింది