CJI B R Gavai: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కు అస్వస్థత
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కు అస్వస్థత
CJI B R Gavai : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI B R Gavai) అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యానికి స్పందిస్తున్నారని, ఒకటి రెండు రోజుల్లో విధులకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
CJI B R Gavai Health Updates
సీజేఐ ఈనెల 12న హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది. అదేరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్’ అనే అంశంపై జస్టిస్ గవాయ్ ప్రసంగం చేశారు. బాబాసాహెబ్ డా.బీఆర్ అంబేడ్కర్ -రాజ్యాంగ సభ- భారత రాజ్యాంగం’ పేరిట పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.
కాగా, ఢిల్లీకి తిరిగివచ్చిన తర్వాత ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో సీజేఐ చేరారు. చికిత్స తీసుకుంటున్నందున సోమవారం నాడు విధులకు హాజరుకాలేదు. భారతదేశ 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ గత మే 14న ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఏడాది నవంబర్ 23న ఆయన పదవీకాలం ముగియనుంది.
CJI B R Gavai – విద్వేష ప్రసంగాలపై సుప్రీం అసహనం
విద్వేష ప్రసంగాల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, అది భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్ర్య విలువను పౌరులు తెలుసుకోవాలని, ఇలాంటి వ్యవహారాల్లో సంయమనం పాటించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలీపై ఫిర్యాదు చేసిన వజహత్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
‘‘విద్వేష ప్రసంగాలు చేసే వారికి అవి ఎంత అసభ్యకరంగా, అనుచితంగా ఉంటున్నాయో ఎందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి వ్యాఖ్యలను షేర్ చేయకుండా కొన్ని కట్టడి చర్యలు చేపట్టాల్సిన అసవరం ఉంది. ప్రజలు కూడా ఇలాంటి వాటిని షేర్ చేయకుండా సంయమనం పాటించాలి. మేం ఇక్కడ సెన్సార్‌షిప్ గురించి మాట్లాడట్లేదు. కానీ, ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ విభజన ధోరణిని అడ్డుకోవాల్సిందే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘‘ఇలాంటి కేసుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఎవరూ కోరుకోరు. కానీ, భావ ప్రకటనా స్వేచ్ఛపై బాధ్యతాయుత ఆంక్షలు సరైనవే. వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యవక్తీకరణ విలువలను ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా.. విద్వేషపూరిత ప్రసంగాలను నిలువరించే మార్గాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
Also Read : Minister Jaishankar: విభేదాలు… వివాదాలుగా మారకూడదు – చైనాకు కేంద్ర మంత్రి జైశంకర్ సూచన
