CJI Chandrachud Manipur Comment : ఈ ప్రశ్నలకు బదులేది..?
నిప్పులు చెరిగిన సీజేఐ
CJI Chandrachud Manipur Comment : మండుతున్న మణిపూర్ పై లెక్కలేనన్ని ప్రశ్నలు. ఎవరికి వారే వాటిని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. కాకూడదు కూడా. మనం ఈ సభ్య సమాజంలోనే ఉన్నామా. లేక ఆదిమ కాలంలో ఏమైనా జీవిస్తున్నామా. ఒక ఘటన జరిగినప్పుడు లేదా మరో సంఘటన చోటు చేసుకున్నప్పుడు కులం, మతం, ప్రాంతం, వర్గాల ప్రస్తావన పదే పదే ఎందుకు వస్తోంది. ఇదేనా రాజకీయం అంటే. ఇందుకేనా బలిదానాలు, ఆత్మ త్యాగాలు, ఉరి కొయ్యలను ముద్దాడి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించింది. లక్షలాది మంది ఇవాళ నిరాశ్రయులుగా మారారు. వారిని మనం మనుషులుగా ఎందుకు పరిగణలోకి తీసుకోలేక పోతున్నాం. ఏ మతం చెప్పింది..విడదీయమని , ఏ కులం చెప్పింది దూరంగా ఉంచమని, ఏ జాతి చెప్పింది హింసకు పాల్పడమని, నగ్నంగా ఊరేగించమని. ఒక రకంగా పదవిలో ఉన్నందుకు బాధగా ఉంది. బాధ్యత కలిగిన ప్రభుత్వాలు నిమ్మకుండి పోతే, నిస్తేజంగా ఉన్నట్టు నటిస్తే ఏమని అనుకోవాలి. దానికి జవాబుదారీగా ఎవరు ఉండాలి.
CJI Chandrachud Manipur Comment Viral
ఒక రాష్ట్రంలో జరిగిందని మరో రాష్ట్రంతో పోటీ పడితే ఎలా. వాళ్లు మనుషులే..వీళ్లూ మనుషులే. ఇంత కర్కశంగా , దారుణంగా ఎలా ప్రవర్తించ గలుగుతున్నారు. దీని వెనుక గల కారణాలను ఇప్పటి వరకు ఎందుకు శోధించ లేక పోయారు. అసలు ఎన్నికైన సర్కార్ అక్కడ ఏం చేస్తోంది. దీనికి జవాబు చెప్పాల్సింది కేంద్రంలోని మోదీ సర్కార్. మణిపూర్ లో కొలువు తీరిన బీరేన్ బీజేపీ ప్రభుత్వం.
మౌనంగా ఉంటే ఏమని అనుకోవాలి. ముందు మీరు మనుషులుగా మారండి. అప్పుడే మానవ సమూహానికి కాస్తంతైనా భద్రత లభిస్తుంది..భరోసా కల్పించినట్లవుతుంది. యావత్ భారత దేశం ఇవాళ మణిపూర్(Manipur) వైపు చూస్తుంటే మీరు ఏం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్(CJI Chandrachud). ఆయన మాట్లాడిన మాటలు నిప్పు కణికల్లా మారాయి. ఒక రకంగా తూటాల్లా గుచ్చుకున్నాయి. మణిపూర్ కేసుపై సుదీర్ఘ చర్చ, వాదోపవాదాలు కొనసాగాయి కోర్టు ప్రాంగణంలో.
ఒక రకంగా మోదీ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వేసిన ప్రశ్నలకు సోలిసిటర్ జనరల్ సమాధానం చెప్పలేక మిన్నకుండి పోయారు. సర్ది చెప్పే ప్రయత్నం చేయడం అంటే నేరం చేసినట్టేనని హెచ్చరించారు సీజేఐ. ఒక రకంగా ఆయన చెంప ఛెళ్లుమనిపించారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కేంద్రం కోరింది. దీనిపై సుదీర్ఘ విచారణ కొనసాగింది. మణిపూర్(Manipur) లో ప్రస్తుతం ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందని నిలదీశారు. బెంగాల్ లో కూడా చోటు చేసుకుందన్న వాదనను తోసి పుచ్చారు సీజేఐ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము సంధించిన ప్రశ్నలకు 24 గంటల లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
మహిళపై నేరాలకు సంబంధించి మీరు మణిపూర్ లో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు ఎన్ని నమోదయ్యాయనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద ఎలాంటి డేటా లేక పోవడం దారుణమని వ్యాఖ్యానించారు. 6 వేల కేసులు నమోదైతే వాటిలో ఎన్ని మహిళలకు సంబంధించినవి ఉన్నాయో చెప్పగలరా. మొత్తం ఆరు ప్రశ్నలు సంధించారు. వీటికి పూర్తి వివరాలతో తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఆగస్టు 1కి వాయిదా వేశారు కేసును. జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కేంద్ర సర్కార్ బాధ్యతా రాహిత్యాన్ని తేటతెల్లం చేసింది. ఇకనైనా మోదీ ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాం.
Also Read : MLA Seethakka : బాధితులకు సీతక్క భరోసా