CJI Sanjiv Khanna: అధికార పదవులకు దూరం – సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా
అధికార పదవులకు దూరం - సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా
CJI Sanjiv Khanna : భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్… చివరి రోజు బెంచ్ కార్యలాపాలు ముగిసిన తర్వాత ఆయనకు మంగళవారం ఉదయం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజేఐ ఖన్నా పనితీరును బార్ సీనియర్ లాయర్లు ఈ సందర్భంగా ప్రశంసించారు. సీజేఐ నిర్ణయాలు ఎంతో ఆలోచనాత్మకంగా, మానవ హక్కులకు ప్రాధాన్యత ఇచ్చేవిగా ఉండేవని తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. సీజేఐ తీర్పులన్నీ చాలా స్పష్టంగా, సరళతతో ఉండేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశంసించారు.
CJI Sanjiv Khanna Comments
ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Sanjiv Khanna) మీడియాతో మాట్లాడుతూ.. రిటైర్మెంట్ అనంతరం ఎలాంటి పదవులూ చేపట్టనని స్పష్టం చేశారు. అయితే, న్యాయవ్యవస్థకు సంబంధించిన ఏదో ఒక పని చేస్తానని తెలిపారు. ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ వివాదానికి సంబంధించిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సంజీవ్ ఖన్నా సమాధామిస్తూ… జ్యూడిషియరీ అనేది సానుకూల, ప్రతికూల అంశాలను చూస్తుందని, హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ”మేము చేయాల్సి వచ్చినప్పుడు, నిర్ణయాలు తీసుకుంటాం. మనం చేసింది సరైనదా, కాదా? అనేది భవిష్యత్తు చెబుతుంది” అని అన్నారు.
భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Sanjiv Khanna) గతేడాది నవంబర్ 11 బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా సమీప బంధువు. 2005లో దిల్లీ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులైన జస్టిస్ ఖన్నా… ఆ మరుసటి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా ఉన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, నవంబర్ 11న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.
తదుపరి సీజేఐగా జస్టిస్ బి.ఆర్. గవాయ్
భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నూతన సీజేఐతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ గవాయ్ పేరును.. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గతంలోనే సిఫారసు చేయడంతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 6 నెలలకుపైగా సీజేఐ పదవిలో కొనసాగనున్న జస్టిస్ గవాయ్.. నవంబరు 23న పదవీ విరమణ చేస్తారు.
Also Read : Miss World: చార్మినార్, చౌముల్లా ప్యాలెస్ వద్ద సందడి చేసిన అందాల భామలు