CM Chandrababu: ప్రధాని మోదీతోనే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు – సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీతోనే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు - సీఎం చంద్రబాబు
CM Chandrababu : యోగా సాధన మానసిక, శారీరక ఆరోగ్యానికి మార్గం చూపుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలంకారీ శాలువాతో సన్మానించి… లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ, “”దేశం, ప్రాంతం, మతం, భాషతో సంబంధం లేకుండా యోగాకు ఆమోదం లభించింది. శరీరం, మనస్సు, ఆత్మలను కలిపేందుకు యోగానే మార్గం. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఒత్తిడిని అధిగమించవచ్చు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాగే ఆత్మవిశ్వాసం పెంచుకోవడం.. మానసిక ప్రశాంతతకు యోగా ఉపకరిస్తుంది. యోగా హింసను తగ్గిస్తుంది. శాంతిని ప్రోత్సహిస్తుంది. ఏఐతో సహా టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో యోగా మరింత విస్తృతమైంది.” అని అన్నారు.
యోగా అంతర్జాతీయ స్థాయికి చేరడానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కారణమని చంద్రబాబు గుర్తు చేశారు. “యోగాకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రధాని మోదీ యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారు. మోదీ చొరవతో మన భారతదేశ సంస్కృతి అయిన యోగాను 175కు పైగా దేశాలలో, 12 లక్షల ప్రదేశాలలో, 10 కోట్ల మందికి పైగా ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు.” అని చంద్రబాబు అన్నారు.
CM Chandrababu – యోగాంధ్ర – ఒక చారిత్రక విజయం
ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కల్పించి, విశాఖకు (Visakhapatnam) వచ్చి యోగా డేలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. “ప్రధాని మోదీ విజన్‌తో స్ఫూర్తి పొంది, ఏపీలో ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర (Yogandhra) ప్రచారాన్ని నిర్వహించాం. దీంట్లో భాగంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులకు శిక్షణ ఇచ్చి, 1.40 లక్షలకు పైగా ప్రాంతాల్లో 2.17 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్లు చేపట్టాం. విశాఖపట్నంలో ఒకే ప్రదేశంలో 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. 1.70 కోట్ల మందికి ధృవపత్రాలు జారీ చేశాం. శుక్రవారం 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించడం మనకు గర్వకారణం.” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఒలింపిక్స్ లో యోగాను చేర్చేలా ప్రధాని చొరవ చూపాలి
“యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా… వివిధ దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారు. సెప్టెంబర్‌లో యోగా సూపర్ లీగ్ ప్రారంభం కానుండడం ఆనందంగా ఉంది. యోగాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్ క్రీడలలో చేర్చేలా ప్రధాని మోదీ చొరవ చూపాలని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి దార్శనికత, గత పదేళ్లుగా యోగాను ప్రోత్సహించడం వల్ల, యోగా ఇప్పుడు ఉద్యమంగా మారింది. చరిత్ర సృష్టించాలన్నా.. రికార్డులు బ్రేక్ చేయాలన్నా ప్రధాని మోదీకే సాధ్యం. యోగా మన జీవితంలో భాగం కావాలి. ప్రజలు ప్రతిరోజూ ఒక గంట యోగా కోసం సమయం కేటాయించాలి. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో క్రమశిక్షణ, సృజనాత్మకత వంటి అంశాలు పెంచుకోవడం చాలా అవసరం. దీనికి యోగా ఉపకరిస్తుంది. వ్యాయామంగానే కాకుండా.. ఓ శక్తివంతమైన సాధనంగా యోగాను ఆచరిద్దాం.” అని ముఖ్యమంత్రి అన్నారు.
విజన్ స్వర్ణ ఆంధ్ర @ 2047 & వన్ ఎర్త్ – వన్ హెల్త్
యోగా వల్ల సంతోషకరమైన సమాజం ఏర్పడుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్ లో భాగంగా “విజన్ స్వర్ణ ఆంధ్ర @ 2047 ప్రణాళికను అనుసరించి అభివృద్ధి, సంక్షేమాలను సాధించడంతో పాటు హెల్తీ వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడమే లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రొత్సాహం వల్లే యోగా, ప్రకృతి చికిత్స, ఆయుర్వేదం, గ్రీన్ ఎనర్జీ, స్వచ్ఛ భారత్, ప్రకృతి వ్యవసాయం వంటి వాటి పునరుద్దరణ సాధ్యమైంది. మోదీ విజన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడడానికి మార్గం సుగమమైంది. వన్ ఎర్త్ – వన్ హెల్త్ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
యోగాను ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనీకుడు మోదీ – పవన్
ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర (Yogandhra) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నాం. యోగా విశిష్ఠతను రుగ్వేదం చెబితే… దాన్ని మోదీ విశ్వవ్యాప్తం చేశారు. భారతీయ సనాతన ధర్మం విశిష్ఠతను యోగా ద్వారా ప్రపంచానికి తెలిపిన ఘనత మోదీదే. యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తంతో ఉంటారనేదానికి.. ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారనేదానికి మోదీ నిలువెత్తు ఉదాహరణ. ‘వన్ ఎర్త్.. వన్ హెల్త్’ థీమ్‌ను విశాఖ వేదిక నుంచి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలి’’ అని పవన్ తెలిపారు.
Also Read : CM Chandrababu: యోగా డే సూపర్ హిట్ – ముఖ్యమంత్రి చంద్రబాబు
