Assembly Dissolve Comment : అరెస్ట్ అయ్యేనా అసెంబ్లీ రద్దేనా..?
మళ్లీ ముందస్తు ముచ్చట
Assembly Dissolve Comment : తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారి పోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతను సాధ్యమైనంత మేరకు అధిగమించాలంటే ముందస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారా సీఎం కేసీఆర్. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. పాలిటిక్స్ లో అపర మేధావిగా పేరు పొందారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.
బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఏకంగా నరేంద్ర మోదీని ఢీకొనేందుకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో తను పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్లాన్స్ వేస్తున్నారు.
వ్యూహాలకు పదును పెడుతున్నారు. కానీ ఉన్నట్టుండి ఢిల్లీ లిక్కర్ స్కాం కేంద్రానికి అంది వచ్చిన అవకాశంగా మారింది కేంద్రానికి. దానిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు రాజకీయానికి తెర లేపింది. ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా పదే పదే చెబుతూ వస్తున్నారు.
తెలంగాణలో ఎగర బోయేది కాషాయ జెండానేనని. ఇది పక్కన పెడితే ప్రస్తుతం మద్యం పాలసీ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. మొత్తం 34 మందిపై అభియోగాలు మోపింది.
11 మందిని అరెస్ట్ చేసింది. పిళ్లై అప్రూవర్ గా మారడంతో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha) నోటీసులు జారీ చేసింది ఈడీ. నేడో రేపో అరెస్ట్ తప్పదని, తీహార్ జైలు ఖాయమని కాషాయ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై సీరియస్ గా స్పందించారు తనయుడు మంత్రి కేటీఆర్. ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరి కవితకు పంపింది ఈడీ నోటీసులు కాదని ప్రధాని నరేంద్ర మోదీ పంపించిన నోటీసులంటూ ఎద్దేవా చేశారు.
కోట్లాది రూపాయలకు పంగనామం పెట్టిన అదానీపై ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు దిగడం లేదంటూ ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ కవిత ధర్నాకు దిగనుంది ఢిల్లీలో.
ఇప్పటికే అరెస్ట్ తతంగంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆమె చేసిన తప్పును యావత్ తెలంగాణకు ఆపాదిస్తే ఎట్లా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనినే హైలెట్ చేశారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం కేసీఆర్ అత్యవసర మీటింగ్ నిర్వహించారు.
రాష్ట్రంలో ఏం జరగ బోతోందన్నది ఉత్కంఠ నెలకొంది. ఇక కేసీఆర్ మామూలోడు కాదని బీజేపీ అగ్ర నేతలకు తెలుసు. ఎక్కడి నుంచైనా మంటలు పుట్టించ గలడు. అన్ని పరిస్థితులను తనకు అనుకూలంగా మల్చుకోగలిగే నేర్పరితనం ఆయనకు ఉంది.
ప్రస్తుతం ధనికమైన రాష్ట్రంగా తెలంగాణ కొనసాగుతోంది. ఒకవేళ కూతురు గనుక ఈడీ అదుపులోకి తీసుకుంటే రాష్ట్రం అల్లకల్లోలం అయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు వెల్లడించాయి. అందుకే కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆమధ్య రాష్ట్రంలో రోడ్డు మార్గం గుండా పర్యటించారు. ఈడీ చాలా తెలివిగా హైదరాబాద్ లో కాకుండా ఢిల్లీకి రావాలని నోటీసులో పేర్కొంది.
మొత్తంగా చూస్తే జరగరానిది ఏదైనా జరిగితే పూర్తిగా అసెంబ్లీని రద్దు(Assembly Dissolve Comment) చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏం జరగబోతోందో అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : అదానీపై ఈడీ ఎందుకు దాడి చేస్తలేదు