CM Revanth Reddy: టీ-ఫైబర్ డీపీఆర్ ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి !
టీ-ఫైబర్ డీపీఆర్ ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి !
CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి చేయూతనివ్వాలని కోరింది. ఈ మేరకు కేంద్ర టెలికంశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కలిశారు. రాష్ట్రంలోని 93 లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. టి-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశమని వివరించారు. నెలకు కేవలం రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రూ.1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.530 కోట్లు సమీకరించిందని తెలిపారు.
CM Revanth Reddy….
టీ-ఫైబర్ ద్వారా తెలంగాణలోని 65వేల ప్రభుత్వ కార్యాలయాలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో 63లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30లక్షల ఇళ్లకు నెలకు కేవలం రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్ అమలుకు గానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వానికి త్వరగా అందించాలని జ్యోతిరాదిత్య సింధియాకు విజ్ఞప్తి చేశారు. ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డీపీఆర్‌ను ఆమోదించాలని సీఎం కోరారు. భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ-ఫైబర్‌కు వర్తింపజేయాలని విన్నవించారు. టీ-ఫైబర్ కోసం రూ.1,779కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు.
జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అనంతరం కేంద్ర క్రీడలశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు హైదరాబాద్‌లో ఉన్నట్లు వివరించారు. భవిష్యత్‌లో ఒలింపిక్స్ , ఆసియా గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం హైదరాబాద్‌కి ఇవ్వాలని కేంద్రమంత్రిని మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.