CM Revanth Reddy: త్వరలో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు !
త్వరలో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు !
CM Revanth Reddy: ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణాలో అధికారంలోనికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలుకు వడివడిగా అడుగులు వేస్తుంది. తెలంగాణా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని త్వరలో అమలు చేయడానికి కసరత్తులు చేస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)… ‘ప్రజాపాలన’ దరఖాస్తులు, గ్యారంటీల అమలుపై కేబినెట్ సబ్ కమిటీ, అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్యారంటీల అమలుకు ఈ బడ్జెట్‌లోనే వాటికి నిధులు కేటాయిస్తామని… కాబట్టి వాటి అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
CM Revanth Reddy Comment
ఈ సందర్భంగా రూ. 500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాల అమలుపై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది… ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్‌లోనే వాటికి నిధులు కేటాయించాలని సీఎం ఆర్థికశాఖకు సూచించారు. శాసనసభ సమావేశాల్లోపు మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా ‘ప్రజాపాలన’లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులందరూ లబ్ధి పొందేలా చూడాలని సీఎం ఆదేశించారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో ఆఫీసుల్లో లేదా మళ్లీ నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో అవకాశమివ్వాలని సూచించారు. అంతేకాదు గ్యారంటీల అమలులో లేనిపోని నిబంధనలతో ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు.
భారీగా ‘ప్రజాపాలన’ ధరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబరు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టగా… అందులో అయిదు గ్యారంటీలకు మొత్తం 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయని… జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు పూర్తి చేశామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులిచ్చారని… కొన్నిటికి ఆధార్, రేషన్ కార్డు నంబర్లు లేవని వివరించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దరఖాస్తుల ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని.. మిగిలిపోయిన వారంతా అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అధికారులపై కఠినంగా ఉంటామని… ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని సీఎం అన్నారు.
Also Read : Minister Ashwini Vaishnaw : విశాఖ రైల్వే జోన్ ఆలస్యానికి కారణాలు ఇవే…