CM Revanth Reddy: మూసీ శుద్ధికి కేంద్రం సహాయం కోరిన సీఎం రేవంత్‌రెడ్డి !
మూసీ శుద్ధికి కేంద్రం సహాయం కోరిన సీఎం రేవంత్‌రెడ్డి !
CM Revanth Reddy: మూసీ నది శుద్ధికి నిధుల సేకరణ లక్ష్యంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలతో కలిసి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, పెట్రోలియం, సహజవాయువుల వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురీ, ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మూసీ నదీతీర అభివృద్ధికి సహకరించాలని సీఆర్ పాటిల్‌ను కోరారు.
CM Revanth Reddy Requests
‘‘హైదరాబాద్ నగరంలోని మురుగు నీరంతా మూసీలో చేరుతోంది. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురుగు నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు ఇవ్వండి. గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లలో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించండి. దీనివల్ల హైదరాబాద్ నగరవాసుల నీటి ఇబ్బందులు తొలగుతాయి. జల్ జీవన్ మిషన్ పథకం 2019లో ప్రారంభమైనా ఇంతవరకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు ఇంకా నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. పీఎంఏవై కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్లు ఖర్చవుతుంది. జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణ(Telangana)కు ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలి’’ అని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కోరారు.
అలాగే ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు త్వరగా చెల్లించేలా చూడాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. 2014-15 ఖరీఫ్ సీజన్ లో అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల రాయితీని విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకు 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.73 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించి రూ. 343.27 కోట్లు విడుదల చేయాలన్నారు. ఆహార భద్రత చట్టం కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన రూ.79.09 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు.
సిలిండర్‌పై వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశం కల్పించాలని హర్దీప్ సింగ్‌ను ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద అర్హులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రికి ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వినియోగదారులు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ తీసుకున్న తర్వాత వారి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తం జమ చేస్తోందని.. దీనివల్ల వారికి ఇబ్బంది కలుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ముందుగానే సబ్సిడీ మొత్తాన్ని చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దాన్ని తీసుకొని అర్హులైన వినియోగదారులందరికీ రూ.500కే సిలిండర్ అందించాలని కోరారు.
Also Read : Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు !బడ్జెట్ లో అమరావతికి రూ. 15 వేల కోట్లు కేటాయింపు !