CM Revanth Reddy: నా గెలుపే ప్రత్యర్థులకు దుఃఖం – సీఎం రేవంత్‌రెడ్డి

నా గెలుపే ప్రత్యర్థులకు దుఃఖం - సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : ‘ఎవరినీ శత్రువుగా చూడను… నేను ఎవరినైనా అలా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 2006లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని… దాదాపు 17 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానని తెలిపారు. శనివారం హైదరాబాద్‌ కళ్యాణ్ నగర్‌లోని తెలంగాణ జెన్ కో ఆడిటోరియంలో ప్రముఖ కవి అందేశ్రీ ప్రచురించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆవిష్కరించారు. పుస్తక రచయిత శ్రీరామ్… పాలమూరు బిడ్డ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గూడ అంజయ్య, అందెశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న లాంటి కవులు తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపారని సీఎం కొనియాడారు.

CM Revanth Reddy Key Comments

‘‘తెలంగాణ ప్రజలు నాపైన పెద్ద బాధ్యత పెట్టారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని వారి అభ్యున్నతి కోసం ఉపయోగిస్తా. నాకు నచ్చని వారిపై అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుడిని కాదు. నా గెలుపే ప్రత్యర్థులకు దుఃఖం. నేను సీఎంగా సంతకం పెట్టడం ప్రత్యర్థుల గుండెలపైన గీత పెట్టినట్లు అయ్యింది. 109 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో జయ జయహే తెలంగాణ గీతం పాడించాం. ఇంత కంటే ఇంకా ఏం కావాలి? భవనాలు ఎవరైనా కడతారు. అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు. పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకోవడమే అభివృద్ధి. రేషన్ కార్డులు, సన్నబియ్యంతో పేదల ఆత్మగౌరవాన్ని పెంచాం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా పదవిని వాడను. పేదల కోసమే పని చేస్తా. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే నా లక్ష్యం. ప్రపంచం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా’’ అని సీఎం అన్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ… తెలంగాణ సమాజం కవులకు స్ఫూర్తిని ఇచ్చిన గడ్డ అని అభివర్ణించారు. నిజమైన ఉద్యమకారులు ఎవరూ నేను ఉద్యమకారుడిని అని చెప్పుకోరన్నారు. అందే శ్రీ ఎప్పుడు నేను ఉద్యమకారుడినని చెప్పుకో లేదని సోదాహరణగా వివరించారు. ఉద్యమకారుడిని అని చెప్పుకున్న వాళ్లకు టీవీలు, పేపర్లు, రూ. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. అయితే మేం ఉద్యమకారులం కాదని.. గాలి ఎటు వీస్తే అటు వెళ్ళే రాజకీయ నాయకులమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : Khazana Jewelry: ఖజానా జ్యువెలర్స్ దోపిడీ మిస్టరీకి ఛేదించిన పోలీసులు

Leave A Reply

Your Email Id will not be published!