CM Revanth Reddy: పెట్టుబడుల వేట లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం రేవంత్‌ జపాన్ పర్యటన

పెట్టుబడుల వేట లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం రేవంత్‌ జపాన్ పర్యటన

CM Revanth Reddy : పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధుల బృందం జపాన్‌ పర్యటన కొనసాగుతోంది. టోక్యోలోని వందేళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌజ్‌లో జపాన్‌ లో భారత రాయబారి శిబు జార్జ్‌ తో ఈ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, టీజీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విష్ణువర్థన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్‌, కాంగ్రెస్‌ ఎంపీ కె.రఘువీర్‌రెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డితోపాటు పలువురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళి, మాజీ ఎంపీ నెపోలియన్‌ కూడా పాల్గొన్నారు. విందు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తమిళనాడు ఎంపీలతో పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడుల అనుకూలతలు, సులభతర వాణిజ్య విధానాలను వివరించారు.

CM Revanth Reddy…

ఈ నెల 13 నుంచి అక్టోబరు 13 వరకు ఆరు నెలలపాటు జపాన్‌లోని ప్రముఖ నగరం ఒసాకాలో ఎక్స్‌పో-2025 జరుగుతుండగా… 160కి పైగా దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ ఎక్స్‌పోలో తెలంగాణ తొలిసారిగా ప్రత్యేక పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. దీనిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాల గురించి ఈ పెవిలియన్‌లో విదేశీ ప్రతినిధులకు వివరించనున్నారు.

జపాన్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి… అక్కడి సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సోని కంపెనీ యానిమేషన్‌ అనుబంధ సంస్థ క్రంచైరోల్‌ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాద్‌ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. యానిమేషన్‌, వీఎఫ్‌ఐ, గేమింగ్‌ రంగాల్లో అనుకూలతలను వివరించారు. అనంతరం ప్రముఖ జపాన్‌ కంపెనీ మారుబెనీ ప్రతినిధుల బృందం టోక్యోలో సీఎంతో భేటీ అయ్యింది. ఫ్యూచర్‌సిటీలో నెక్ట్స్‌ జనరేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుపై చర్చించారు. నెక్ట్స్‌ జనరేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు మారుబెనీ సంస్థ ముందుకొచ్చింది.

మొత్తం 600 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో పార్క్‌ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌పై ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టుతో సుమారు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ‘‘ఫూచర్‌ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్కు ఇదే. సుమారు 30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలున్నాయి. దేశంలోనే తొలి నెట్‌ జీరో సిటీగా ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మారుబేని ముందుకు రావడం సంతోషం’’ అని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకున్న దార్శనికతను మారుబేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ దై సకాకురా ప్రశంసించారు. తెలంగాణలో అవకాశాలను వినియోగించుకునేందుకు ముందు వరుసలో ఉంటామని చెప్పారు. కాగా, మారుబేని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410 కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫుడ్, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్ , మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉందీ కంపెనీ.

Also Read : Supreme Court: కంచగచ్చిబౌలిలో పచ్చదనాన్ని పునరుద్ధరిస్తారా ? లేక జైలుకెళ్తారా?

Leave A Reply

Your Email Id will not be published!