CM Siddaramaiah: ‘ఓటు చోరీ’పై నోరుజారిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
‘ఓటు చోరీ’పై నోరుజారిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
CM Siddaramaiah : ‘ఓటు చోరీ’ పేరుతో బీజేపీతో పాటు ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్… బిహార్‌లో ‘ఓట్ అధికార్ యాత్ర’ చేపట్టింది. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) చేసిన వ్యాఖ్యలు… ఇప్పుడు ఆ పార్టీని చిక్కుల్లో పడేలా చేశాయి. గతంలో జేడీఎస్ అభ్యర్థిగా తాను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని, దానికి ఓట్ల చోరీనే (అప్పటి కాంగ్రెస్) కారణమంటూ వ్యాఖ్యానించారు. దీనితో ముఖ్యమంత్రి తన సొంత పార్టీ తీరును బయటపెట్టారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
CM Siddaramaiah – సీఎం సిద్ధరామయ్య ఏమన్నారంటే ?
రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్‌గా చేసిన రవివర్మ కుమార్ సన్మాన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) మాట్లాడుతూ… ‘‘1991లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయా. ఆ ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్లే ప్రతికూల ఫలితం వచ్చింది. దానిపై అడ్వకేట్ రవి వర్మ ద్వారా కేసు కూడా దాఖలు చేశా. ఆయన పైసా తీసుకోకుండా నా తరఫున పోరాడారు’’ అని సిద్ధరామయ్య వివరించారు. దీనితో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీని చిక్కుల్లో పడేశాయి.
1991 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ కర్ణాటకలోని కొప్పల్ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా సిద్ధరామయ్య పోటీ చేయగా.. కాంగ్రెస్ తరఫున బసవరాజ్ పాటిల్ అన్వారీ పోటీ చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి అన్వారి 1989లో జేడీఎస్ టికెట్‌పై గెలిచి 1991లో కాంగ్రెస్‌లో చేరారు. 1991 ఎన్నికల్లో అన్వారికి 2.41 లక్షల ఓట్లు పోల్ కాగా.. 11,200 ఆధిక్యంతో సిద్ధరామయ్యపై గెలిచారు. కౌంటింగ్ అధికారులు 22,243 ఓట్లను చెల్లవని చెప్పడంతో తాను ఓడిపోయానని… లేకపోతే ఆ ఓట్లతో తాను గెలిచి ఉండేవాడినని అన్నారు. అయితే ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్లే తాను ఓడిపోయానని ఆరోపించిన సిద్ధరామయ్య… ఆ ఎన్నికల తీర్పును కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. కౌంటింగ్ అధికారులు దాదాపు 22వేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించడంతోనే తాను ఓడిపోయాయని, లేదంటే అదే మెజార్టీతో గెలిచేవాడినని అప్పట్లో పేర్కొన్నారు.
సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ‘ఓటు చోరీ’పై గతంలో పోరాటం చేసిన వ్యక్తి… అదే కాంగ్రెస్ తరఫున ‘ఓట్ అధికార్’ యాత్రలో పాల్గొనడం విడ్డూరమని పేర్కొంది. అప్పుడు బ్యాలెట్ పేపర్లపై, ఇప్పుడు ఓటరు జాబితాపై ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.
Also Read : PM Narendra Modi: చంద్రయాన్-5 కోసం జపాన్‌తో కలిసి పనిచేస్తాం – ప్రధాని మోదీ
