PM Narendra Modi: చంద్రయాన్‌-5 కోసం జపాన్‌తో కలిసి పనిచేస్తాం – ప్రధాని మోదీ

చంద్రయాన్‌-5 కోసం జపాన్‌తో కలిసి పనిచేస్తాం - ప్రధాని మోదీ

Narendra Modi: అంతరిక్షరంగంలో గొప్ప విజయాలు సాధిస్తోన్న భారత్‌… మరో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్‌-5 మిషన్‌ కోసం జపాన్‌తో కలిసి పనిచేయనుంది. ఇందుకోసం ఇరుదేశాల అంతరిక్ష సంస్థలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ (Narendra Modi) ప్రకటించారు. రెండు ఆసియా దేశాల మధ్య పెరుగుతోన్న వ్యూహాత్మక, శాస్త్రీయ భాగస్వామ్యానికి ఈ ప్రకటన నిదర్శనంగా కనిపిస్తోంది.

ఆర్థిక సహకారం, ఆరోగ్యం, ఏఐ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాల ప్రధానులు ఈ పర్యటనలో భాగంగా ప్రధానంగా దృష్టిసారించారు. చంద్రయాన్‌-5 మిషన్ చంద్రుడి ఉపరితలం, పర్యావరణంపై శాస్త్రీయ అవగాహనను పెంచుతుందని భావిస్తున్నారు. జపాన్‌ తో కలిసి పనిచేయడం ద్వారా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకునే వీలు కలగనుంది.

ఇదిలాఉండగా… చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్‌-5 మిషన్‌కు కొన్నినెలల క్రితం కేంద్రం ఆమోదం తెలిపింది. 2023లో ప్రయోగించిన చంద్రయాన్‌-3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్‌ రోవర్‌ ను జాబిల్లిపై దించామని ఆ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ పేర్కొన్నారు. చంద్రయాన్‌-5లో మాత్రం 250 కిలోల రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ చేస్తామన్నారు. జపాన్‌తో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. ఇప్పుడు దీనిపై మోదీ (Narendra Modi) స్వయంగా ప్రకటన చేశారు. ఇక, జాబిల్లి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్‌-4 మిషన్‌ను 2027లో ప్రయోగించనున్నారు.

Narendra Modi – భారత్‌-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

భారత్‌-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు. చైనాలో జరగనున్న ఎస్‌సీవో (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) సమ్మిట్ కోసం చైనా తియాంజిన్ నగరానికి వెళ్లనున్నారు. అంతకంటే ముందే చైనా పర్యటనపై ప్రధాని మోదీ స్పందించారు.

ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్న మోదీని ఆ దేశ ప్రముఖ జాతీయ దినపత్రిక ‘యోమియురి షింబున్’ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో అంతర్జాతీయంగా ఆర్ధిక ఒడిదుడుకులు కొనసాగుతున్న తరుణంలో భారత్‌-చైనాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇరు దేశాలు పరస్పర గౌరవం, ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కలిసి ముందుకు సాగాలి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు తియాంజిన్‌కి వెళ్లనున్నట్లు చెప్పిన మోదీ.. గతేడాది కజాన్‌లో జరిగిన ఓ సమావేశం తర్వాత ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని తెలిపారు.

భారత్, చైనా వంటి రెండు పెద్ద దేశాల మధ్య స్థిరమైన, అనుకూలమైన సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత్-చైనా కలిసి పనిచేయడం ద్వారా ఆర్థిక స్థిరత సాధించవచ్చని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ శనివారం సాయంత్రం చైనాలోని తియాంజిన్ చేరతారు. ఆదివారం ఉదయం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో 40 నిమిషాల పాటు సమావేశం జరగనుంది. సోమవారం ఎస్‌సీవో ప్రధాన సమావేశం జరుగుతుంది.ఈ క్రమంలో 2020 నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలను పునరుద్ధరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read : Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్‌ ! గ్రామాలను ముంచెత్తుతున్న వరదలు !

Leave A Reply

Your Email Id will not be published!