YS Sharmila Security: వైఎస్ షర్మిల భద్రతపై కాంగ్రెస్ నేతల ఆందోళన !
వైఎస్ షర్మిల భద్రతపై కాంగ్రెస్ నేతల ఆందోళన !
YS Sharmila: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భద్రతపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలపై(YS Sharmila) అధికార వైసీపీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు… కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటూ పెద్ద ఎత్తున షర్మిలపై వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారు. దీనితో ఏపీలో షర్మిలకు భద్రత పెంచాలంటూ… కాంగ్రెస్ సీనియర్ నేతలు సోషల్ మీడియా వేదికగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి దృష్టికి తెచ్చారు.
గతంలో వైఎస్ షర్మిలకు 4+4 సెక్యూరిటీ కలిగి ఉండేవారు. ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉన్న ఈ తరుణంలో ఆమె సెక్యూరిటీను 1+1కు తగ్గించారు. కార్యకర్తల సమావేశాల కోసం ఆమె రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆమెకు అత్యవసరంగా 4+4 సెక్యూరిటీ, ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలి’’ అని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సోషల్ మీడియా వేదికగా డీజీపీని కోరారు.
YS Sharmila Security Issue
ఇది ఇలా ఉండగా గతంలో షర్మిలకు తెలంగాణ పోలీసులు 4+4 భద్రత కల్పించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక్కడి ప్రభుత్వం 1+1 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. 4+4 భద్రత, ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలని కోరుతూ జనవరి 22న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆమె లేఖ రాశారు. అయితే ఇంతవరకు పోలీసు శాఖ నుండి గాని ప్రభుత్వం నుండి గాని స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డీజీపీ దృష్టికి తీసుకెళ్ళారు. ఇటీవల మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా షర్మిల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అని తేడా లేదని… అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తారని దీనికి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన వివేకానంద హత్య కేసు, కోడి కత్తి కేసు నిదర్శనమంటూ ఎద్దేవా చేసారు.
Also Read : YSRCP 5th List: వైసీపీ ఐదో జాబితా విడుదల !