CSK vs RCB IPL 2023 : ఆర్సీబీకి షాక్ చెన్నై ఝలక్
8 పరుగుల తేడాతో ధోనీ సేన విజయ కేతనం
CSK vs RCB IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠను రేపింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK vs RCB IPL 2023) , ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చివరి వరకు నువ్వా నేనా అన్న రీతిలో పోరు సాగింది. ఆఖరు వరకు పోరాడింది ఆర్సీబీ. కానీ విజయం అంచుల దాకా వచ్చి బోల్తా పడింది.
ఆట ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయినా ఎక్కడా తగ్గలేదు బెంగళూరు. స్కిప్పర్ ఫాఫ్ డుప్లెసిస్ , గ్లెన్ మ్యాక్స్ వెల్ లు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించారు. చివరలో దినేష్ కార్తీక్ ప్రయత్నం చేసినా చెన్నై బౌలర్ల మ్యాజిక్ ముందు బొక్క బోర్లా పడింది బెంగళూరు. మొత్తంగా చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది.
ఈసారి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 224 పరుగుల అత్యధిక స్కోర్ సాధిస్తే దానిని చెన్నై సూపర్ కింగ్స్ అధిగమించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 226 రన్స్ చేసింది. సీఎస్కే తరపున డేవాన్ కాన్వే రెచ్చిపోతే శివమ్ దూబే శివమెత్తాడు. తుఫాన్ ఇన్నింగ్స్ లు ఆడారు. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 218 రన్స్ చేసింది. మాక్స్ వెల్ 76 రన్స్ చేస్తే డుప్లెసిస్ 62 రన్స్ చేశాడు. దినేష్ కార్తీక్ 28 పరుగులతో ఆకట్టుకున్నాడు.
Also Read : చితక్కొట్టిన ఫాఫ్ డుప్లెసిస్