Brij Bhushan Sharan Singh : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ పై కేసులు
ఎట్టకేలకు స్పందించిన ఖాకీలు
Brij Bhushan Sharan Singh : ఎట్టకేలకు పోలీసులు కేసులు నమోదు చేశారు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ , రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై. ఇందులో మైనర్ రెజ్లర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై కేసు నమోదు చేయడం విశేషం. తమను గత కొంత కాలంగా లైంగికంగా, మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు భారత దేశానికి చెందిన 9 మంది రెజ్లర్లు. కేంద్రం విచారణ కమిటీ వేసినా ఫలితం రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నీటి పర్యంతం అయ్యారు. దేశ రాజధాని లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సైతం మద్దతు తెలిపారు. తాము ఫిర్యాదు చేసినా ఢిల్లీ ఖాకీలు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై(Brij Bhushan Sharan Singh) కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ఈ మేరకు బాధిత రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
బాధిత మహిళలు భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వారు చేసిన ఆరోపణలపై ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ సీరియస్ అయ్యారు సీజేఐ డీవై చంద్రచూడ్. ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. ఈ మేరకు స్పందించిన పోలీసులు ఎట్టకేలకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెండు కేసులు చేశారు. ఈ విషయాన్ని భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానంకు తెలిపారు.
Also Read : తెర వెనుక కథ కన్నీటి వ్యధ