DIG Ammi Reddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు !

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు !

DIG Ammi Reddy: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల ఎస్పీ అన్బురాజన్‌ ను బదిలీ చేసిన ఈసీ… తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఉన్నతాధికారులను ఆదేశించింది. అధికార వైసీపీ(YCP)కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

DIG Ammi Reddy Transfered

వైసీపీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌ ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది. మరోవైపు అనంతపురం అర్బన్‌ డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్‌ కుమార్‌ ను, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతిపక్షాలపై అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తిరిగి బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికల్లో వైసీపీ(YCP)కు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిపై విచారించిన ఎన్నికల సంఘం చివరకు ఆయన్ను బదిలీ చేసింది. ఆయన తర్వాత స్థానంలోని అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు వీలుగా ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పేర్లతో ప్యానల్‌ జాబితాను సమర్పించాలని సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది.

అమ్మిరెడ్డి 2023 ఏప్రిల్‌ 13న అనంతపురం రేంజి డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కోరిన సీఐలకు పోస్టింగులిచ్చి పరోక్షంగా సహకరించారనే అరోపణలు ఉన్నాయి. అనంతపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో సొంత సామాజికవర్గానికి చెందిన సీఐలను నియమించి వైసీపీ నాయకులకు అండదండలు అందించారనే విమర్శలు కూడా ఉన్నాయి. వైసీపీ(YCP)కు విధేయుడిగా పేరున్న వీరరాఘవరెడ్డిని అనంతపురం డీఎస్పీగా తీసుకురావడంలో అమ్మిరెడ్డిదే కీలకపాత్రనే విమర్శలున్నాయి. వీరరాఘవరెడ్డి ఏకపక్ష ధోరణిపై టీడీపీ పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించలేదు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంతపురం గ్రామీణ సర్కిల్‌, ఇటుకలపల్లి సర్కిల్‌ పోలీసులు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదులున్నా చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్‌కు ముందే అనంతపురం గ్రామీణం, ఇటుకలపల్లి సీఐలను బదిలీ చేయాలని ఫిర్యాదులొచ్చినా వారిని ఆ స్థానాల్లోనే కొనసాగించారని టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Also Read : Minister Jogi Ramesh : మంత్రి జోగి రమేష్ కొడుకు పై ఎస్సీ, ఎస్టి కేసు

Leave A Reply

Your Email Id will not be published!